పోతిరెడ్డిపాడులో కొనసాగనున్న ఏపీ జలదోపిడీ

కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లోని ప్రాజెక్టుల వద్ద ప్రతిపాదించిన టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు మొదటిదశ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రతిపాదించిన 18 చోట్లకు గాను 17చోట్ల సివిల్ పనులు పూర్తయ్యాయి. పరికరాలు బిగించడం ఒక్కటే మిగిలింది. కానీ ఒక్క పోతిరెడ్డిపాడులో మాత్రం పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. కనీసం డిజైన్ కూడా కొలిక్కి రాలేదు.

అయితే ఉభయ రాష్ర్టాలు అంగీకరించిన చోటును మార్చాలని కృష్ణాబోర్డు ప్రతిపాదించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. అసలు టెలిమెట్రీ వ్యవస్థ తెరపైకి వచ్చిందే పోతిరెడ్డిపాడు సమస్య మీద. అయినా అక్కడే బోర్డు అధికారులు కాలయాపన చేయడం అనుమానాలు రేకెత్తిస్తున్నది. ఏమైనా ఈ ఏడాది కూడా పోతిరెడ్డిపాడు వద్ద అవుట్ ఫ్లో కొలిచే పరికరం ఏర్పాటు జరుగదని తేలిపోయింది.

కృష్ణానది మీద ప్రాజెక్టులకు మూడు నెలల్లో టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని గత ఏడాది జూన్ 21, 22 తేదీల్లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమర్‌జిత్ సింగ్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఆదేశాలిచ్చారు. గత ఏడాది కృష్ణా బేసిన్‌లోకి వరద ఉధృతి పెరుగుతున్న సమయంలో పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ భారీ ఎత్తున జలాల్ని అక్రమంగా తరలించడాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రత్యక్షంగా బోర్డ్ చైర్మన్, అధికారులకు చూపించారు. దీంతో కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ టెలిమెట్రీ నిర్ణయాన్ని తీసుకుంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు 600 మీటర్ల దూరంలో సాంకేతిక పరికరం ఏర్పాటుకు ఉభయ రాష్ర్టాలు సమ్మతించాయి. ఇది జరిగిన ఆర్నెల్ల తర్వాత ఎంపిక చేసిన పాయింట్‌ను మారుస్తామంటూ బోర్డు సభ్య కార్యదర్శి వివాదాన్ని రాజేశారు. దీనితో అక్కడ టెలిమెట్రీ పనులు పెండింగ్‌లో పడ్డాయి.

మొదటి విడత టెలిమెట్రీలో 18 పాయింట్లు ఎంపిక చేస్తే అందులో 14 పాయింట్లు తెలంగాణ పరిధిలో మిగిలిన నాలుగు ఏపీలో ఉన్నాయి. పరికరాల ఏర్పాటుకు కృష్ణా బోర్డు టెండర్లు పూర్తి చేసి మెకాట్రానిక్స్ అనే కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. మే ఐదో తేదీ లోగా పనులు పూర్తి చేయాలని గడువునిచ్చింది. అయితే ఆ తర్వాత గడువును మరో 45 రోజులు పెంచింది. ఈ మేరకు ప్రస్తుతం తెలంగాణ పరిధిలోని 14 పాయింట్లతో పాటు ఏపీలో పోతిరెడ్డిపాడు మినహా మిగిలిన మూడు చోట్ల సివిల్ పనులు పూర్తయ్యాయి.

అన్ని చోట్ల పనులు పూర్తవుతున్నా ఏపీ జలదోపిడీకి సింహద్వారమైన పోతిరెడ్డిపాడులో మాత్రం ఇంకా డిజైనే ఖరారు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.