పోటీతత్వంలో భారత్‌కు 45వ స్థానం

పోటీతత్వంలో భారత్ 45వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది విడుదలైన జాబితాతో పోలిస్తే 4 స్థానాలు కిందికి జారుకుంది. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ (ఐఎండీ) సంస్థకు చెందిన వరల్డ్ కాంపిటీటివ్‌నెస్ సెంటర్ ఈ లిస్టును రూపొందించింది. పోటీతత్వంలో ముందున్న దేశాల్లో హాంకాంగ్‌కు అగ్రస్థానం దక్కింది. అగ్రరాజ్యం అమెరికా టాప్ -3 నుంచి వైదొలిగి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. స్విట్జర్లాండ్, సింగపూర్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. నెదర్లాండ్స్‌కు ఐదో స్థానం లభించగా.. ఐర్లాండ్ 6, డెన్మార్క్ 7, లక్సెంబర్గ్ 8, స్వీడన్ 9, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) 10వ స్థానంలో ఉన్నాయి.  ఈ గ్లోబల్ జాబితాలో ఇండియా ర్యాంకింగ్ తగ్గగా.. చైనా ఏకంగా ఏడు మెట్లు ఎగబాకి 18వ స్థానానికి చేరుకుంది. రాజకీయ సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్, బ్రెజిల్, వెనిజులా దేశాలు వరుసగా 60, 61, 63 స్థానాల్లో నిలిచాయి. ఈ లిస్టులో సైప్రస్, సౌదీ అరేబియాకు తొలిసారిగా స్థానం దక్కింది. స్విట్జర్లాండ్‌లోని ఐఎండీ బిజినెస్ స్కూల్‌లోని పరిశోధన విభాగమే ఐఎండీ వరల్డ్ కాంపిటీటివ్‌నెస్ సెంటర్. 1989 నుంచి ప్రతియేటా ఈ సంస్థ పోటీతత్వంలో ముందున్న దేశాల జాబితాను విడుదల చేస్తున్నది.