పేదల ముఖాల్లో చిరునవ్వే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పాలన కొనసాగిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. గత ప్రభుత్వాలు చారాణా ఇచ్చి.. బారాణా ప్రచారం చేసుకున్నాయని కేటీఆర్‌ మండిపడ్డారు. అటు సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో కార్మికులకు న్యాయం చేస్తామన్న కేటీఆర్.. పనిలేని కొన్ని సంఘాల మాటలు నమ్మి సమ్మెలో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌.. డబుల్ బెడ్ రూం ఇండ్లు, మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

బెల్లంపల్లి పట్టణం అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.15 కోట్లు మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. బెల్లంపల్లిలో వంద పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు.

ఈ సభలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, ఎంపీ బాల్క సుమన్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.