పెట్రోల్ ధరలు ఇలా తెలుసుకోవచ్చు!

పెట్రోల్, డీజిల్ ధరల్లో శుక్రవారం నుంచి ప్రతి రోజూ మార్పులు జరుగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ మార్పులు చేస్తారు. పెట్రోల్ వినియోగదారులు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మొబైల్ యాప్ ఫ్యూయల్ @ ఐవోసీ ద్వారా తాజా పెట్రోల్, డీజిల్ ధరల సమాచారం తెలుసుకోవచ్చు. ధరల వ్యవస్థలో మెరుగైన పారదర్శక విధానం అమలుతోపాటు మెరుగైన ధరలకు పెట్రోల్, డీజిల్‌ను వినియోగదారులకు సరఫరా చేసేందుకు ఈ చర్య చేపట్టామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్) తెలిపింది. ఇక నుంచి ప్రతి రోజూ పెట్రోల్ బంకుల దగ్గర టేబుల్‌పై పెట్రోల్, డీజిల్ ధరలను ప్రదర్శిస్తారు. వినియోగదారులకు ఎస్సెమ్మెస్‌ల ద్వారా సమాచారం అందజేస్తారు. వినియోగదారులు తమ నగరాల పరిధిలో ధరలను తెలుసుకునేందుకు RSP< SPACE >DEALER CODEకు ఎస్సెమ్మెస్ పంపడం గానీ, 92249-92249 నంబర్‌కు గానీ ఫోన్ చేయాలని ఐవోసీఎల్ తెలిపింది.