పెట్టుబడుల ఆకర్షణలో హైదరాబాద్‌ నెం.1   

సుస్థిరమైన సంస్కరణలు.. దీర్ఘకాలిక అభివృద్ధికి అపారమైన అవకాశాలు.. ఈ రెండింటి కారణంగా వాణిజ్య పెట్టుబడులను ఆకర్షించడంలో హైదరాబాద్ ఆసియా పసిఫిక్‌ లో నెంబర్‌వన్ నగరంగా అవతరించింది. గత ప్రభుత్వాల మాదిరిగా ఐటీ రంగం మీదే ఆధారపడకుండా.. పారిశ్రామిక రంగంలో సరికొత్త వెలుగురేఖలను ప్రసరింపచేయాలని ప్రభుత్వం ముందే సంకల్పించింది. దీనికోసం వినూత్నమైన టీఎస్ ఐపాస్ ద్వారా.. గత రెండేండ్లలో 3,828 పరిశ్రమలకు అనుమతి మంజూరు చేసింది. దాదాపు రూ.72 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో, కనీసం 2.30 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి లభిస్తుంది. హిందూజా గ్రూప్, ఎంఆర్‌ఎఫ్, ఐటీసీ గ్రూప్, తొషిబా, స్నైడర్, ఐకియా వంటి కంపెనీలు రాష్ట్రంలోకి అడుగుపెట్టడానికి ప్రధాన కారణమిదే. ప్రోత్సాహకర ప్రభుత్వం ఉండటంతో  పలు సంస్థలు తమ కార్యకలాపాలను ఇక్కడే విస్తరిస్తున్నాయి. లైఫ్ సైన్సెస్ విభాగంలో గతేడాది మన రాష్ట్రంలో.. సుమారు పదకొండు సంస్థలు, రెండు వేల కోట్లకు పైగా పెట్టుబడులను పెట్టడానికి ముందుకొచ్చాయి.

 

సాధారణంగా భాగ్యనగరంలో ఏటా 30 నుంచి 35 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలానికి గిరాకీ ఉంటుంది. కానీ, గతేడాది ఈ గిరాకీ రెట్టింపైంది. 65 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్‌ను పలు బహుళ జాతి సంస్థలు తీసుకున్నాయి. నాణ్యమైన ఆఫీసు స్థలం లేకపోవడం వల్ల పలు సంస్థలు సొంతంగా స్థలాన్ని కొని.. శాశ్వత నిర్మాణాల్ని చేపడుతున్నాయి. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరగడానికి పుష్కలమైన అవకాశాలున్నాయి. నిన్నటివరకూ హైదరాబాద్ విచ్చేయడానికి వెనకడుగు వేసిన సంస్థలన్నీ ఇప్పుడు ఇటువైపే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్, సాలార్‌పురియా, మంత్రీ వంటి సంస్థలు నిర్మాణాలను చేపడుతున్నాయి. కల్పతరు, పసిఫిక్, లోధా, మహీంద్రా లైఫ్ స్పేసెస్, హీరానందానీ, పార్శనాథ్, ప్రావిడెంట్ వంటి కంపెనీలు ప్రాజెక్టులను నిర్మిస్తున్నాయి.

సాఫ్ట్‌ వేర్ నిపుణులు గతంలో బెంగళూరు, పుణె, చెన్నై వంటి నగరాల వైపు దృష్టి సారించేవారు. కానీ, అక్కడితో పోల్చితే హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటం, ధరలూ సగానికే దొరకడంతో.. ఐటీ రంగనిపుణులంతా మళ్లీ హైదరాబాద్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇది నగర రియల్ రంగానికెంతో సానుకూల నిర్ణయమని చెప్పొచ్చు. రెరా బిల్లు, జీఎస్టీ కారణంగా.. చాలామంది కొనుగోలుదారులు భాగ్యనగరంలో స్థిరనివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌లో వాణిజ్య సముదాయాలకు గిరాకీ పెరిగితే.. సహజంగానే లగ్జరీ ఫ్లాట్లు, విల్లాలకు గిరాకీ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

2018, 2019 సంవత్సరాల్లో నిర్మాణాలు పూర్తయ్యే వాటిలోనూ ప్రస్తుతం పలు సంస్థలు ఆఫీసు స్థలాన్ని తీసుకుంటున్నాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్ సంస్థ రెండు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని నాలెడ్జి సిటీలో లీజుకు తీసుకుంది. మరో రెండున్నర లక్షల స్థలాన్ని తీసుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. అమెజాన్ ఇక్కడ్నుంచే ప్రపంచవ్యాప్త కార్యకలాపాలను నిర్వహించడానికి వ్యూహరచన చేస్తోంది. ఆరు లక్షల చ.అ. స్థలాన్ని లీజుకు తీసుకుంది. వాణిజ్య స్థలానికి గిరాకీ పెరుగుతుందే తప్ప తగ్గే ప్రసక్తే లేదు.

గ్లోబల్ సంస్థలన్నీ హైదరాబాద్ ను ఎంచుకోవటానికి చాలా కారణాలే ఉన్నాయి. చెన్నైలో వరదల సమస్యకు తోడు  రాజకీయ అస్థిరత నెలకొంది. బెంగళూరులో ట్రాఫిక్, కాలుష్యంతో పాటు అద్దెలూ ఎక్కువ. ఈ నేపథ్యంలో బహుళ జాతి సంస్థలు అన్ని విధాలుగా మెరుగ్గా కన్పిస్తోన్న భాగ్యనగరం వైపు దృష్టి సారిస్తున్నాయి. అందుకే, గ్లోబెల్ ఇన్వెస్టర్లు హైదరాబాద్‌లోకి అడుగుపెట్టడానికి సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఇది హైదరాబాద్ మార్కెట్‌కు ఎంతో శుభపరిణామం. దీంతో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా నగరంలోని నివాస సముదాయాలకు గిరాకీ గణనీయంగా పెరుగుతుంది.
వాస్తవానికి, భాగ్యనగరం ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే. బహుళ జాతి సంస్థలు కూడా తక్కువ ఖర్చు అయ్యే నగరాల్లోనే తమ కార్యకలాపాల్ని నిర్వహించడానికి మొగ్గు చూపుతాయి. ప్రపంచ దేశాలకు నేరుగా విమాన సౌకర్యం, ఇక్కడి వాతావరణం, ఇండ్లు, ఆఫీసు ధరలు తక్కువ, ఆంగ్ల భాష పరిజ్ఞానమున్న యువతకు కొదవే లేదు. వీటిన్నింటిని మించి సానుకూలమైన ప్రభుత్వం. వీటన్నింటి కారణంగానే పెట్టుబడుల ఆకర్షణలో హైదరాబాద్ దూసుకెళ్తోంది.