పితృదేవో భవ… నాన్నకు ప్రేమతో హ్యాపీ ఫాదర్స్ డే …

నాన్న నీలాకాశం. నాన్న అమృతం నింపుకున్న కలశం. తండ్రి మనసు హిమాచలం.  తండ్రి మనసు తొణకి వ్యక్తిత్వం. అతనొక నిలువెత్తు గాంభీర్యం. అతనొక నడిచొచ్చే జ్ఞాపకం. ఈ మమతల పందిరి  కింద నాన్నకొక చిన్న ప్రశంసాపత్రం.  నాన్న అనే పదానికి నిర్వచనం కావాలంటే కేవలం గుండెనడిగితే సరిపోదు. అంతులేని విశ్వం మొత్తాన్ని శోధించాలి. తండ్రి మనసు అర్ధంకాని అంతరిక్షం. ఆయన హృదయం అంతుచిక్కని పాతాళం. నాన్న కాళ్లమీద కాళ్లుపెట్టి నడిచిన ఆ రోజుల్ని తలుచుకుంటే- తన కష్టాన్ని కాళ్లకింద పెట్టి చేతులతో సంతోషాన్ని ఎలా పంచి ఇచ్చాడో ఇప్పుడర్ధమవుతుంది. అందుకే నాన్న అర్ధంకాని జీవి.

చిన్నప్పుడు మనల్ని పైకి ఎగరేసి అందుకున్న జ్ఞాపకాల్ని తడిమి చూసుకుంటే.. అట్టడుక్కి జారిపోయిన ధైర్యం- గుండెలోకి ఎగదన్నుకొస్తుంది. అందుకే నాన్నంటే అంతులేని భరోసా.సుఖమనే పదం మరిచిపోయిన త్యాగశీలి నాన్న. అమ్యూజ్‌మెంట్ పార్కులో తిరిగి తిరిగి అలసిపోయి.. నాన్న వీపు మీద రెప్పవాల్చిన బాల్యం మదిలోకి వస్తే- పిల్లల ఆనందం కోసం తనెంత త్యాగం చేశాడో గుర్తొస్తుంది.

తండ్రి తొలిగురువే కాదు మలి గురువు కూడా! ఆయన భుజాలపై కూర్చునే కదా అందమైన ప్రపంచాన్ని చూశాం. ఆయన వేలుపట్టుకునే కదా ఈ లోకంలో నడిచాం. అందుకే నాన్న తొలిగురువూ, మలిగురువూ.నాన్న అన్ సంగ్‌ హీరో. డాబామీద పతంగి కీంచ్ కట్ చేయడంలో నాన్న తర్వాతే ఎవరైనా. నాన్న అన్నీ తెలిసిన హీరో. నాన్న అన్ సంగ్ హీరో!

కూతురు ఇంజక్షన్ అంటే భయపడ్డప్పుడు- ఆ భయాన్ని పోగొట్టడానికి నాన్న ఇచ్చిన ఎక్స్‌ ప్రెషన్ ఎప్పటికీ మరిచిపోలేం. అందుకే నాన్న మరపురాని జ్ఞాపకం. ఎక్స్ కర్షన్ వెళ్తానంటే అమ్మ ఖరాకండిగా నో చెప్పినా, నాన్నమాత్రం చిన్న కనుసైగతో రైట్ రైట్ అన్నప్పటి ఆనందాన్ని మళ్లీ తీసుకురాగలమా? అందుకే నాన్న మనసు వెన్నకంటే మెత్తన.

అప్పుడప్పుడు వంటింట్లో అమ్మలా మారిపోతాడు. కొడుకు బైక్ రిపేర్ చేస్తూ మెకానిక్ అవతారమెత్తుతాడు. లోకంలో ఎలా మసలుకోవాలో కూతురికి చెప్తూ  దార్శనికుడవుతాడు. నాన్నంటే స్నేహితుడు. నాన్నంటే రక్షకుడు.

చిన్నప్పుడు నాన్న కాళ్లు చుట్టేసిన జ్ఞాపకం. ఆయన నడుం చుట్టూ చేతులేసిన జ్ఞాపకం. ఆయన చాతీమీద వాలిపోయిన జ్ఞాపకం. ఆయన వీపు మీద చేయివేసి నడిచిన జ్ఞాపకం. ఇలా మమతల పందిరి కింద నాన్నకోసం ఎన్నెన్ని జ్ఞాపకాలని. మీసాల్లో తెల్లవెంట్రుకలు వచ్చినా ఇంకా పిల్లల దృష్టిలో హీరోనే. అతనెప్పటికీ హీరోనే.

బాపు ఛాతీ మీద జీవితాన్ని కాచివడబోసిన గీతలున్నవి చూశారా… అవి వట్టి గీతలు కావు.. ఎలా బతకాలో చెప్పే తోవలు. అందుకే  రెక్కలు ముక్కలు చేసుకుని, బతుకునంతా ధారవోసి, బిడ్డల్ని సాకే నాన్నలంతా వర్ధిల్లాలి !! హాపీ ఫాదర్స్ డే!!