పాలమూరు ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష

పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. వచ్చే నెల (జూలై) చివరికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించకపోతే ఏజెన్సీలతో పాటు సంబంధిత ఇంజనీర్లపై కూడా చర్యలు తప్పవని హరీశ్ రావు హెచ్చరించారు. హైదరాబాద్ లోని జలసౌధలో మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డితో కలిసి పాలమూరు ప్రాజెక్టులపై ఆయన సమీక్షించారు.

నిర్మాణంలో ఉన్న నాలుగు సాగునీటి పథకాలపై ఇద్దరు మంత్రులు దాదాపు ఐదు గంటలు సమీక్ష జరిపారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తి  చేయాలని కోరారు. భూసేకరణపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని గద్వాల, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల కలెక్టర్లను ఫోన్ లో మంత్రి ఆదేశించారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో ఇంకా వెయ్యి ఎకరాలు సేకరించవలసి ఉందన్నారు. నాలుగు ప్రాజెక్టుల పనుల పురోగతిని, భూసేకరణ ప్రక్రియను ప్యాకేజీల వారీగా మంత్రులు సమీక్షించారు.

కల్వకుర్తి నుంచి 3 లక్షలు, భీమా నుంచి 2 లక్షలు, నెట్టంపాడు నుంచి 1.50 లక్షలు, కోయిల్ సాగర్ నుంచి 50 వేల ఎకరాలకు ఈ ఖరీఫ్ లో సాగునీరు అందించవలసిందేనని హరీశ్ రావు అన్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి లక్ష ఎకరాలకు కలుపుకొని మొత్తం 8 లక్షల ఎకరాలకు నీరందించాలని చెప్పారు. ఆయా ప్రాజెక్టుల కింద చెరువులను నింపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి చెరువులు నింపే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమైనందున ప్రాజెక్టుల నిర్వహణ విషయాలు తక్షణం సమీక్షించాలని ఇంజనీరింగ్ అధికారులను కోరారు. పంప్ హౌస్ లలో ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్లను వెంటనే నియమించాలని అడ్మినిస్ట్రేషన్ ఎ.ఎన్.సి.విజయప్రకాశ్ ను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.

టైమ్ ఫ్రేమ్ లో పనులు చేయని ఏజన్సీలపై ’60 సి’  నిబంధన కింద చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ మంత్రి ఆదేశించారు. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల కోసం ప్రాధాన్యత ప్రకారం ప్రభుత్వం పెట్టిన టార్గెట్ తో పనులు పూర్తి  చేయాలన్నారు. ఖరీఫ్ లోగా పాలమూరు ప్రాజెక్టుల పూర్తి విషయమై శాసనసభలో హామీ ఇచ్చినట్టు మంత్రి గుర్తు చేశారు.

కొన్ని ప్యాకేజీల పనులకు ఇసుక కొరత ఉన్నట్లు ఇరిగేషన్ ఇంజనీర్లు తెలియజేసిన వెంటనే సంబంధిత రెవెన్యూ ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రి హరీశ్ రావు కోరారు. ఇసుక కొరత సమస్యలు పరిష్కరించాలని టి.ఎస్.ఎం.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్ మల్సూర్ ను మంత్రి ఆదేశించారు.
కాంట్రాక్టు ఏజెన్సీలు, ఇరిగేషన్ అధికారులు, స్థానిక శాసససభ్యులు, నాయకుల సహకారంతో  పనిచేసి ప్రాజెక్టులను నిర్ణీత గడువులోపలే పూర్తి చేయాలని మహబూబ్ నగర్ సి.ఇ సహా ఇంజనీరింగ్ అధికార యంత్రాoగాన్ని మంత్రి కోరారు.

పాలమూరు జిల్లాలోని ఆన్ గోయింగ్ సాగునీటి పధకాల లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన కృషి చేయాలన్నారు హరీశ్ రావు. నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏళ్ల తరబడి పూర్తి కాని ఈ ప్రాజెక్టులను ఖరీఫ్ లోపు పూర్తి చేయవలసిందేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, ఫీల్డు చానళ్లను తనిఖీలు చేయాలని, ఆయా కాలువల్లో ఉన్న గడ్డి, రాళ్ళు, రప్పలు, ఇతర అడ్డంకులు తొలగించాలని కోరారు. పంప్ హౌస్ ల నిర్వహణకు సంబంధించిన పనులు వెంటనే పూర్తి చేయాలని హరీశ్ ఆదేశించారు.

ఈ నాలుగు ఆన్ గోయింగ్ పథకాల కోసం ఇంకా భూసేకరణ జరగవలసి ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తయితే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ నాలుగు ఆన్ గోయింగ్ పథకాలకు నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు మంత్రి చెప్పారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జోషి, ఈఎన్సి మురళీధరరావు, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, సిఇ ఖగేందర్ రావు, ఓఎస్డీ దేశ్ పాండే, వివిధ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.