పారిస్‌లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌లో అడుగుపెట్టారు. ఇటీవల జరిగిన ఫ్రాన్స్ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన నూతన అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్‌జీలో భారత్‌కు సభ్యుత్వం, పర్యావరణ పరిరక్షణ, తీవ్రవాదం తదితర కీలక అంశాలు వీరి మధ్య చర్చకు రానున్నాయి. ఫ్రాన్స్‌లో అడుగుపెడుతున్న సందర్భంగా ప్రధాని మోడీ ట్విటర్లో స్పందిస్తూ… ‘‘ముఖ్య వ్యూహాత్మక భాగస్వాముల్లో ఒకటైన ఫ్రాన్స్‌‌తో సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు ఇక్కడికి చేరుకున్నాను..’’ అని చెప్పారు. శుక్రవారం రష్యా పర్యటనలో గడిపిన ప్రధాని మోడీ.. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కావడంతో పాటు ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు. రష్యాకు ముందు జర్మనీ, స్పెయిన్ దేశాలలో ప్రధాని పర్యటించారు.