పాక్‌ నిజ స్వరూపాన్ని గుర్తించిన అమెరికా

పాకిస్థాన్ ఉగ్రవాదులకు సహకరిస్తోందన్న భారత్‌ వాదన నిజమని అమెరికా అధ్యయన సంస్థ పేర్కొన్న నివేదికతో బయటపడింది. పాకిస్థాన్‌ ఎంత మాత్రం మంచి దేశం కాదని అమెరికా మేధావులు హెచ్చరించారు. తాలిబాన్‌, హక్కానీ నెట్‌వర్క్‌ లకు ఈ దేశం సురక్షితంగా మారిందని సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ నివేదికలో వెల్లడైంది.

ఆఘ్ఘనిస్థాన్ ప్రస్తుతం అన్ని విధాలుగానూ దయనీయ స్థితిలో ఉందని నివేదికలో తెలిపారు. యుద్ధం, రాజకీయాలు, పరిపాలన, పేదరికం వంటి అంశాల్లో దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే పాకిస్థాన్‌ మాత్రం మిత్ర దేశంగా కన్నా పెను ముప్పుగా చెప్పవచ్చునని అధ్యయనం చేసిన మేధావులు పేర్కొన్నారు. తాలిబన్‌, హక్కానీ సంస్థలకు మద్దతును కొనసాగిస్తే ఆంక్షలు విధిస్తామని పాకిస్థాన్‌ను హెచ్చరించాలని సైతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మేధావులు సూచించారు.

ఈ నివేదికను ఆంథోనీ హెచ్ కోర్డ్స్‌ మన్, ఆర్లీగ్ ఏ బుర్కే రూపొందించారు. చైనాతో అమెరికా సంప్రదింపులు జరపాలని, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లతో వ్యవహరించడంలో సహకరిస్తే… చైనాకు, అమెరికాకు ప్రయోజనం కలుగుతుందని వివరించాలని వీరు అమెరికా అధ్యక్షున్ని కోరారు. తాజా నివేదికతో పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు సహకరిస్తుందన్న భారత వాదన సైతం నిజమన్నది తేలిపోయింది.