పప్పు అన్నందుకు పదవి పోయింది!

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని పప్పూ పేరుతో ప్రత్యర్థిపార్టీలు ఎద్దేవా చేస్తుంటాయి. ఇదే పదాన్ని కాంగ్రెస్ పార్టీ నేత పొరపాటున వినియోగించినందుకు అతన్ని పదవుల నుంచి తొలగిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఐదుగురు రైతులు చనిపోయిన సందర్భంలో బాధిత రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్‌గాంధీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వినయ్ ప్రధాన్ వాట్సప్‌లో సందేశాలు పంపారు. భారత జాతీయ కాంగ్రెస్ టైటిల్‌తో పెట్టిన ఈ మెసేజ్‌లు వివాదాస్పదమయ్యాయి. “పప్పూ అనుకుంటే అదానీ, అంబానీ, మాల్యాలతో చేతులు కలుపొచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. ఆ మార్గంలో వెళ్తే మంత్రి లేదా ప్రధానమంత్రి కావొచ్చు. అయినా దాన్ని ఎంచుకోలేదు. అందుకుబదులుగా మంద్‌సౌర్ మార్గంపట్టి తన జీవిత ఆశయాన్ని తెలియజేశారు” అంటూ వినయ్ వాట్సప్‌లో మెసేజ్ పెట్టారు. ఈ సందేశాలు వైరల్‌గా మారడంతో ఆయనకు చిక్కులొచ్చిపడ్డాయి. వినయ్‌ను అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది.