పనిచేయని బోర్లను పూడ్చకుంటే కేసు, జరిమానా

ప‌నిచేయ‌ని బోరుబావుల గుంత‌ల‌ను వచ్చే నెల (జులై) 10 లోపు పూడ్చివేయాల‌ని పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆదేశించారు. లేకుంటే కేసులు న‌మోదు చేయ‌డంతో పాటు భారీగా జ‌రిమానా విధించాల‌ని చెప్పారు.   ప‌నిచేయ‌ని బోర్ వెల్స్ విష‌యంలో తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై పంచాయ‌తీరాజ్, రెవెన్యూ, భూగ‌ర్భ జ‌ల శాఖ అధికారుల‌తో సచివాలయంలో మంత్రి స‌మీక్ష నిర్వహించారు. రెవెన్యూ, పంచాయ‌తీరాజ్‌ శాఖల ముఖ్య కార్యద‌ర్శులు మీనా, వికాస్ రాజ్‌, క‌మిష‌న‌ర్ నీతూ ప్రసాద్‌ల‌తో ఈ అంశంపై చ‌ర్చించారు.

అనుమతి లేకుండా విచ్చల‌విడిగా బోర్లు వేయ‌డం, ప‌నిచేయ‌ని వాటిని పూడ్చక‌పోవ‌డంపై సీరియ‌స్‌ గా వ్యవ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉందని మంత్రి కృష్ణారావు స్పష్టం చేశారు.  నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా బోర్లు వేసే రిగ్స్ ఓన‌ర్లతో పాటు.. భూ య‌జ‌మానుల‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవ‌లం 350 రిగ్స్‌ కు మాత్ర‌మే భూగ‌ర్భ జ‌ల శాఖ అనుమ‌తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బోర్లు వేయ‌డానికి 15 రోజుల ముందే అనుమ‌తులు తీసుకోవాల‌ని, అనుమ‌తి లేకుండా బోర్లు వేస్తే రిగ్ య‌జ‌మానుల‌పై ల‌క్ష వ‌ర‌కు జ‌రిమానా విధించాల‌ని నిర్ణయించారు. అదే విధంగా అనుమ‌తులు లేని రిగ్స్‌ ను సీజ్ చేయ‌డంతో పాటు.. జ‌రిమానా విధించాల‌ని నిర్ణయించారు.

చెడిపోయిన‌, ప‌నిచేయ‌ని బోర్లను పూడ్చివేసే బాధ్యత‌ను పూర్తిగా య‌జ‌మానులే తీసుకోవాల‌ని నిర్ణయించారు. పూడ్చక‌పోతే 50 వేల వ‌ర‌కు జ‌రిమానా విధించేలా ఉత్తర్వులు జారీ చేయాల‌ని అధికారుల‌ను మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆదేశించారు. ఈ బాధ్యత‌ను క్షేత్రస్థాయిలో వీఆర్వో, గ్రామ కార్యద‌ర్శి, స‌ర్పంచ్‌ల‌కు అప్పగించ‌నున్నట్లు ప్రక‌టించారు.

చెడిపోయిన‌, ప‌నిచేయ‌ని బోర్ వెల్స్‌ కు సంబంధించి నేటి నుండే గ్రామాల‌వారీగా స‌ర్వే చేయాల‌ని మంత్రి జూపల్లి ఆదేశించారు. భూ య‌జ‌మాని, బోర్ ఉన్న స‌ర్వే నెంబ‌ర్‌, బోర్ వేసిన రిగ్ ఓన‌ర్‌, ప‌నిచేయ‌ని బోర్ అయితే గుంత‌ను పూడ్చారా, లేదా అన్న అంశాల‌పై గ్రామ కార్యద‌ర్శి, వీఆర్వోల ఆధ్వర్యంలో స‌మ‌గ్ర స‌ర్వేను చేప‌ట్టాల‌ని నిర్ణయించారు. స‌ర్వే సంద‌ర్భంగానే ఎక్కడిక‌క్క‌డ భూ య‌జ‌మానుల‌తో బోర్‌వెల్ గుంత‌ల‌ను పూడ్పించేందుకు కూడా చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు.