పట్టిసీమలో మా వాటా తేల్చండి!

కృష్ణా జలాల్లో పట్టిసీమ వాటాను తేల్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ విషయాన్ని వెంటనే తేల్చాలని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాయనుంది. గోదావరి నదీజలాల వివాద ట్రిబ్యున ల్ నిర్దేశం ప్రకారం ఎగువ రాష్ట్రంగా తెలంగాణకు ఈ హక్కు ఉన్నదని స్పష్టం చేయనుంది. ఏపీ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరిజలాలను మళ్లిస్తున్నందున ఆ మేరకు కృష్ణాజలాల్లో తెలంగాణకు  వాటా వస్తుంది. ఇంతకుముందు గత ఏడాది ఏపీ ప్రభుత్వం 53 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించింది. ఈ ఏడాది 80 టీఎంసీలను మళ్లిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు. ఆ మేరకు 45 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ కోరనుంది.
పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరిజలాలను కృష్ణా డెల్టాకు అంటే కృష్ణా బేసిన్‌కు మళ్లించాలనేది ఏపీ ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై గతంలో ఉమ్మడి ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. దాన్ని గోదావరి నదీజలాల వివాద ట్రిబ్యునల్‌లో పొందుపరిచారు. దశాబ్దాలుగా కృష్ణాజలాలను సీమాంధ్రలోని ఇతర బేసిన్‌లకు తరలించిన అప్పటి సమైక్య పాలకులు ఆ అక్రమ తరలింపును కాపాడుకునేందుకుగా 1978, ఆగస్టు 4న కర్ణాటకతో ఆ ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం పోలవరం ద్వారా గోదావరిజలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నందు వల్ల నాగార్జున సాగర్‌కు ఎగువన ఉన్న రాష్ర్టాలకు ఆ మేరకు కృష్ణాజలాల్లో వాటా ఇస్తామని అంగీకరించారు. దాని ప్రకారం ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు వాటాగా ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం అనుమతిచ్చిన మరుక్షణం నుంచి సాగర్‌కు ఎగువన రాష్ర్టాలకు కృష్ణాజలాల్లో ఆ మేరకు నీటి హక్కు వస్తుంది. అంటే పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినపుడే తెలంగాణ సహా కర్ణాటక, మహారాష్ట్రకు హక్కులు సంక్రమించాయి. దానికి అనుగుణంగా కర్ణాటక తనకు దక్కిన వాటాకు సరిపడా ఎత్తిపోతల పథకాలను రూపొందించుకొని వాడుకుంటున్నది. కానీ తెలంగాణకు మాత్రం వాటా తేలలేదు. పైగా ఇపుడు పోలవరంతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి గత ఏడాది నుంచే గోదావరిజలాల మళ్లింపును చేపట్టింది. మళ్లీ తెలంగాణ వాటాను కేంద్రం తేల్చలేదు.

గత నీటి సంవత్సరం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ ద్వారా 53 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఒత్తిడి తేగా కేంద్రం బజాజ్ కమిటీని వేసింది. ఆ కమిటీ 90 రోజుల్లో ఇవ్వాల్సిన నివేదికను గడువు పొడగించినా ఇవ్వకుండా బంతిని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కోర్టులోకి నెట్టింది. ఈ ఏడాది కూడా పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల నీటిని డెల్టాకు మళ్లించేందుకు ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమై కేంద్ర జల వనరుల శాఖకు లేఖ రాసేందుకు సిద్ధమైంది. ఈసారి 80 టీఎంసీలు మళ్లించనున్నందున తెలంగాణ వాటా కింద 45 టీఎంసీలను కృష్ణాజలాల్లో ఇవ్వాలని స్పష్టంగా కోరనుంది. ఆ నీటిని ఇస్తే రాష్ట్రంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాల్వతో పాటు నల్లగొండ జిల్లాలోని తాగు, సాగునీటి ప్రాజెక్టు అయిన ఉదయ సముద్రంకు కేటాయించుకుంటామని లేఖలో స్పష్టం చేయనుంది.