పట్టిసీమ ద్వారా ఏపీ జలదోపిడీ

పట్టిసీమద్వారా గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు మళ్లించడమనేది కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి వస్తుందని చెప్తున్నా ఏపీ పెడచెవిన పెడుతోంది.  2017-18 నీటి సంవత్సరానికి ఎలాంటి విధివిధానాలు ఖరారు కాకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమద్వారా ముమ్మరంగా నీటిని తరలిస్తున్నది. ఇది కండ్ల ముందే కనిపిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం 4500 క్యూసెక్కుల డిశ్చార్జ్‌తో డెల్టాకు గోదావరి జలాలను ఏపీ తరలిస్తున్నది. వాస్తవంగా మహారాష్ట్ర నుంచిగానీ, ఇటు ప్రాణహిత, ఇంద్రావతి నుంచిగానీ ఇంకా సరైన ఇన్‌ఫ్లోలు మొదలే కాలేదు. కానీ వీటితో పాటు శబరి నుంచి వచ్చే కొద్దిపాటి నీటిని సైతం ఏపీ పట్టిసీమతో మళ్లిస్తున్నది. గతేడాది 53 టీఎంసీలను ఏపీ మళ్లించుకుంది. ఈ దఫా 80 టీఎంసీల కంటే ఎక్కువనే డెల్టాకు తరలిస్తామని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. గతేడాది గోదావరి జలాల మళ్లింపునకు అనుగుణంగా తెలంగాణకు కించిత్తు వాటాను కృష్ణాజలాల్లో ఇవ్వలేదు. పైగా కృష్ణా బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్ వాడుకున్న నీటి వినియోగంలోనూ పట్టిసీమ జలాలను పరిగణనలోకి తీసుకోలేదు.

అటు వాటా ఇవ్వకుండా, ఇటు లెక్కల్లోకి తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ మాత్రం నీటిని వాడుకుంటూ పోవడమంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? రెండు నదీ యాజమాన్య బోర్డులు ఎందుకు ఉన్నట్లు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెత్తనంపై యావ తప్ప పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు విస్మరిస్తున్నాయని పలువురు జల నిపుణులు విమర్శిస్తున్నారు. ట్రిబ్యునల్ తీర్పులు అధికారిక రికార్డుల్లో భద్రంగా ఉన్నా, కళ్ల ముందు గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పరుగులు పెడుతున్నా కేంద్ర సర్కారు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నారు. పట్టిసీమ ద్వారా ఆంధ్రపదేశ్ ప్రభుత్వం డెల్టాకు ఎంత నీటిని మళ్లిస్తున్నది? దానిలో తెలంగాణకు రావాల్సిన వాటా ఎంత? కనీసం కృష్ణా బేసిన్‌లో గోదావరిజలాల వినియోగమెంత? ఇవన్నీ లెక్కలు తేల్చాల్సింది ఎవరు? వీటన్నింటికీ ఒక పరిష్కారం చూపే రెండు రాష్ర్టాలతో కూడిన సమావేశాన్ని కూడా కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ నేటికీ ఖరారు చేయలేదు.

తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య నదీజలాల పంపిణీ తీరుపై అంతా స్తబ్దత నెలకొంది. వాస్తవంగా కీలకమైన కృష్ణాజలాల పంపిణీపై రాష్ట్ర విభజన తర్వాత ప్రతి ఏటా జూన్ 11-12 తేదీల్లోనే సమావేశాలు ఏర్పాటుచేసేవారు. గతేడాది జూన్ 21-22 తేదీల్లో సమావేశాలు నిర్వహించారు. కానీ, ఈ ఏడాది ఆ అంశంపై ఎవరూ దృష్టిసారించడం లేదు. ఈ నెల 28, 29వ తేదీల్లో భేటీ నిర్వహించేందుకు కృష్ణా బోర్డు కొంతమేర కసరత్తు చేసినా ప్రస్తుతం మాత్రం ఆ దిశగా కదలికలేవీ కనిపించడం లేదు. దీంతో కనీసం హైదరాబాద్ తాగునీటి కోసం ఒక్క టీఎంసీ నీటిని శ్రీశైలం నుంచి వదులాలని తెలంగాణ కోరుతున్నా.. బోర్డు తన అధికారాలు ఉపయోగించడం లేదు.