నోకియా నుంచి మూడు స్మార్ట్‌ఫోన్లు

దేశీయ మార్కెట్లోకి నోకియా మరో మూడు రకాల స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్ల తయారీలో అగ్రగామి సంస్థలైన సామ్‌సంగ్, ఆపిల్ వంటి సంస్థలకు పోటీగా హెచ్‌ఎండీ గ్లోబల్.. నోకియా 6, నోకియా 5, నోకియా 3 వంటి స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్ల ప్రారంభ ధరను రూ.9,499గా నిర్ణయించింది. నోకియా ప్రజల బ్రాండ్..కస్టమర్లు సంస్థపై పెట్టుకున్న నమ్మకాని వమ్ము చేయకుండా ఈ స్మార్ట్‌ఫోన్లను రూపొందించినట్లు నోకియా ఇండియా వైస్-ప్రెసిడెంట్ అజేయ్ మెహతా తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్లలో రూ.9,499 ధర కలిగిన నోకియా 3 ఉండగా.. రూ. 12,899 విలువైన నోకియా 5, రూ. 14,999 ధర కలిగిన నోకియా 6లు ఉన్నాయి. గడిచిన నెలలో ఐకానిక్ 3310 ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది.  నోకియా 3 మాత్రం ఈ నెల 16 నుంచి అమెజాన్‌లో మాత్రమే లభించనుండగా, నోకియా 5 వచ్చే నెల 7 నుంచి, నోకియా 6 జూలై 14 నుంచి అందుబాటులోకి రానున్నాయి.