నాలాల ఆక్రమణలు తొలిగించేందుకు రూ.230 కోట్లు

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో నాలాల విస్త‌ర‌ణ‌కు తీవ్ర అడ్డంకిగా ఉన్న 1,002 అక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమతించింది. ఇందుకోసం 230 కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చించ‌డానికి జీహెచ్ఎంసీకి అనుమతిస్తూ జీవో ఆర్‌.టి నెంబ‌ర్ 341ని నేడు విడుద‌ల చేసింది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో మొద‌టి ద‌శ‌లో 16.66 కిలోమీట‌ర్ల 1002 ప్ర‌ధాన అడ్డంకుల‌ను తొల‌గించి నాలాల అభివృద్దికిగాను అంత‌ర్గ‌త నిధులైన 230 కోట్లను వెచ్చించ‌డానికి అనుమ‌తిస్తున్నట్టు ఉత్త‌ర్వులో పేర్కొన్నారు. ఈ 230 కోట్ల రూపాయ‌ల‌తో చేప‌ట్టాల్సిన నాలా విస్త‌ర‌ణ ప‌నుల‌కు వెంట‌నే టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను పూర్తిచేసి ప‌నులు ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులో స్ప‌ష్టం చేసింది.

కాగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఉన్న 390 కిలోమీట‌ర్ల పొడ‌వుగ‌ల మొత్తం నాలాల్లో 12,432 క‌ట్ట‌డాలు ఉన్న‌ట్టు స‌ర్వేలో నిర్ధారించారు. ఈ మొత్తం క‌ట్ట‌డాల‌ను తొల‌గించ‌డానికి భారీ స్థాయిలో వ్య‌యం అవుతున్న దృష్ట్యా అత్యంత కీల‌క అడ్డంకులైన 1,002 క‌ట్ట‌డాలు, ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించేందుకు రూ. 230 కోట్లు వ్య‌యం చేయ‌డానికి అనుమ‌తి ఇవ్వాల్సిందిగా కోరుతూ జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డాక్టర్ బి.జ‌నార్థ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించారు. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌కు అంగీక‌రించిన ప్ర‌భుత్వం నేడు ఈ ఉత్త‌ర్వులు జారీచేసింది.