నకిలీ విత్తనాల సరఫరా ముఠా అరెస్ట్

నకిలీ విత్తనాల తయారీదారులపై సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడే పోలీసులు దాడులు నిర్వహిస్తూ నకిలీవిత్తనాలు తయారీదారుల భరతం పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలను సరఫరా చేస్తూ.. రైతులను మోసం చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టిన సీపీ మహేశ్‌భగవత్‌.. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వారిలో ప్రధాన నిందితులు చిన్నం జానకీరాం, సంఘీ మహేందర్, శ్రీను, లక్ష్మిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముఠా సభ్యులు తెలంగాణ, కర్నాటక, ఏపీ, మహారాష్ట్ర రైతులను మోసం చేస్తున్నట్లు తెలిపారు. తొర్రూర్‌లోని సృష్టి సీడ్స్ నుంచి 1,651 కేజీల నకిలీ విత్తనాలను హయత్‌నగర్ పోలీసులు సీజ్ చేసినట్లు తెలిపారు. భూత్పూర్‌లో గోపీకృష్ణ సీడ్స్ కంపెనీలో 2,045 కేజీల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేసినట్లు చెప్పారు. 1, 050 కిలోల నకిలీ కందులను సీజ్ చేసినట్లు వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.46 లక్షలుంటుందని తెలిపారు. నిందితులపై ఐపీసీ 13(1), 18(1), సీడ్ కంట్రోల్ యాక్ట్ 420, 188 కింద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు.