నకిలీ విత్తనాల తయారీదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం

రైతులతో జీవితాలతో చెలగాటమాడుతున్న నకిలీ విత్తనాల తయారీదారులపై సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నది. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు నకిలీ ముఠాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ దాడులు నిర్వహిస్తున్నారు. నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని.. వారి ఆగడాలకు చెక్ పెడుతున్నారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలంలోని పలు విత్తనాలు, ఎరువుల షాపులపై అధికారులు దాడులు నిర్వహించారు.  పోలీసులు, వ్యవసాయ అధికారులు కలిసి విస్తృతంగా తనిఖీలు చేసారు. మండల కేంద్రంలో ని కుమ్మరి వాడలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. షాపు సీజ్ చేసి.. 50 వేల విలువ చేసే 25 కిలోల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

అటు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ లోని గోపిక సీడ్స్ పై రాచకొండ ఎస్ ఓ టి, హయత్ నగర్ పోలీసులు దాడులు చేశారు. నకిలీ విత్తనాలను సరఫరా చేయడంతో పాటు  కాలం చెల్లిన, నాసిరకం విత్తనాలకు కెమికల్స్ కలిపి కల్తీ చేసినట్టు గుర్తించారు.  46 లక్షల విలువైన నకిలీ విత్తనాలు సీజ్  చేశారు పోలీసులు. అటు హయత్ నగర్ లోని సృష్టి సీడ్స్ పైనా దాడులు జరిపారు. గోపిక సీడ్స్, సృష్టి సీడ్స్ రెండింటి యజమాని గోపీకృష్ణే అని తేలింది. దీంతో  గోపిక  సీడ్స్ యజమాని గోపికృష్ణను అరెస్టు చేశారు.

నకిలీ విత్తనాల కేసులో ప్రధాన నిందితులు చిన్నం జానకీరాం, సంఘీ మహేందర్, శ్రీను, లక్ష్మిని  పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ  ముఠా సభ్యులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. తొర్రూర్ లోని సృష్టి సీడ్స్  నుంచి 1651 కేజీల నకిలీ విత్తనాలు… భూత్పూర్  లో  గోపీకృష్ణ సీడ్స్  కంపెనీలో 2045 కేజీల నకిలీ పత్తి విత్తనాలు సీజ్  చేశారు పోలీసులు. తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల రైతులను నిందితులు మోసం చేసినట్టు గుర్తించారు.నిందితులపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు.  అటు నకిలీ విత్తనాల కేసులో నిర్లక్ష్యం వహించిన భూత్పూర్ ఎస్ఐ అశోక్ ను సస్పెండ్ చేశారు.