దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధలతో రంజాన్ వేడుకలు

దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయమే ముస్లింలు మసీదులకు చేరుకున్నారు. ఢిల్లీలోని జామా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అలయ్‌ భలయ్‌ తీసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆగ్రా, లక్నో, భోపాల్‌ తో పాటు ముంబైలోని ఈద్గాలు ముస్లింలతో కిక్కిరిసిపోయాయి.

బీహార్‌ లో కూడా ఈద్‌ వేడుకలు గ్రాండ్‌ గా జరిగాయి. గాంధీ మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల్లో పాల్గొన్న ఆ రాష్ట్ర సీఎం నితీష్‌ కుమార్‌  రంజాన్‌ శుభాకాంక్షలు చెప్పారు.

బెంగాల్‌ లోని మసీదులన్ని ముస్లింలతో కిక్కిరిసిపోయాయి. పలు ప్రధాన నగరాల్లో ఉన్న చారిత్రక ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కోల్‌ కతాలోని రెడ్ రోడ్డులో ఓ మసీదును సందర్శించిన సీఎం మమతా బెనర్జీ.. ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు చెప్పారు. ఈద్ సందర్భంగా భారత్-బంగ్లాదేశ్ బార్డర్ లో స్వీట్లు పంచుకున్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు, బంగ్లాదేశ్ జవాన్లు ఈద్ ముబారక్ చెప్పుకొని స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు.

గుజరాత్‌ లో రంజాన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వడోదరలోని ఈద్గాలో క్రికెటర్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసుఫ్ పఠాన్‌ లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతీ ఒక్కరు మానవత్వంతో ఆలోచిస్తూ, ప్రేమను పంచాలని కోరారు ఇర్ఫాన్‌  పఠాన్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీలు దేశ ప్రజలకు ఈద్ ముబారక్ చెప్పారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

గత కొద్ది రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతున్న డార్జిలింగ్ లో ఈద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు ప్రశాంతంగా ముగిశాయి. బంద్ కారణంగా పెద్దగా ప్రజలు బయటకు రాలేదు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

జమ్మూకాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో రంజాన్ ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.