దేశంలో తెలంగాణ ప్రభుత్వానిదే ఆ ఘనత

దేశంలోనే రంజాన్ పండుగను ప్రభుత్వం తరుఫున అధికారికంగా జరుపుతున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. రంజాన్ సందర్భంగా 4 లక్షల మంది పేద ముస్లిం మైనారిటీలకు దుస్తులు, పండగ సామాగ్రి పంపిణీ చేస్తున్న ఘనత టిఆర్ఎస్ సర్కారుదేనని చెప్పారు. దావత్ ఏ ఇఫ్తార్ కార్యక్రమాన్ని దేశంలోనే మొదటిసారిగా కేసీఆర్ సిద్దిపేటలో ప్రారంభించారని, అదే స్ఫూర్తి కొనసాగుతున్నదని గుర్తుచేశారు. సిద్దిపేటలో ప్రభుత్వం తరుఫున ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. హిందువులకు వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేసినట్టు ముస్లింలకు అఖిరి సఫర్ వాహనాన్ని ప్రారంభించారు.

సిద్దిపేటలో మొట్టమొదటిసారిగా షాదీఖానా నిర్మించుకున్నామని, ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా షాదీఖానాలు ప్రభుత్వం నిర్మించేందుకు కృషి చేస్తున్నదని మంత్రి హరీశ్ రావు చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అన్ని మతాలను భాగస్వాములను చేయాలనేదే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు.

ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే బాబుమోహన్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, కలెక్టర్ వెంకట్రాం రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.