దళిత బిడ్డకు అత్యున్నత అవకాశం

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా అనూహ్యంగా తెరపైకి వచ్చారు రామ్ నాథ్ కోవింద్. ప్రస్తుతం బీహార్ గవర్నర్ గా పని చేస్తున్న ఆయన, బీజేపీలో పలు కీలక పదవులు చేపట్టారు. 1945 అక్టోబర్ 1న ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లా డేరాపూర్ లో ఓ సాధారణ దళిత రైతు కుటుంబంలో జన్మించారు.  కాన్పూర్ యూనివర్సిటీ నుంచి బీకాంతో పాటూ ఎల్‌ఎల్‌బీ పట్టా కూడా పొందారు రామ్ నాథ్ కోవింద్.

బీజేపీలో చేరక ముందు లాయర్ గా సేవలందించారు రామ్ నాధ్ కోవింద్.  1977 నుంచి 1979 వరకు ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరుపున లాయర్ గా పని చేశారు. సుప్రీం కోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ లో 1980 నుంచి 1993 వరకు పని చేశారు. సుప్రీం కోర్టు లాయర్ గా కూడా రామ్ నాథ్ కోవింద్ సేవలందించారు. లాయర్ పలువురు పేదలకు ఉచితంగా న్యాయ సహాయం చేశారు.

ఇక బీజేపీలో పలు కీలక పదవులను చేపట్టారు. 1998 నుంచి2002 వరకు బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా పని చేశారు. ఆల్ ఇండియా కోలి సమాజ్ అధ్యక్షుడిగా, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు. 2015 ఆగస్ట్ 8 న బీహార్ గవర్నర్ గా నియమితులయ్యారు.

రామ్ నాథ్ కోవింద్ రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలందించారు. 1994 ఏప్రిల్ లో యూపీ నుంచి తొలి సారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వరుసగా పన్నేండేళ్ల పాటూ  2006 మార్చ్ వరకు పదవిలో కొనసాగారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా పని చేయడమే కాకుండా, రాజ్యసభ హౌజ్ కమిటీ ఛైర్మన్ గా కూడా పని చేశారు రామ్ నాథ్ కోవింద్.

71 ఏళ్ల రామ్ నాథ్ కోవింద్ 1974లో సవితా కోవింద్ తో వివాహం జరిగింది. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.