థాయ్‌ టోర్నీ సెమీస్‌లోకి సైనా, ప్రణీత్

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మళ్లీ పాతఫామ్‌ను అందుకుంటున్నది. ఈ హైదరాబాదీ ఏస్ తాజాగా థాయ్‌లాండ్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించే దిశగా దూసుకెళుతున్నది. మహిళల సింగిల్స్‌లో సైనా సెమీఫైనల్ చేరింది. భారత్ నుంచి సైనాతో పాటు సాయి ప్రణీత్ సెమీస్‌లో ప్రవేశించి పురుషుల టైటిల్ అందుకునేందుకు రెండడుగుల దూరంలో నిలిచాడు. రెండోసీడ్‌గా బరిలోకి దిగిన సైనా క్వార్టర్స్‌లో 21-15, 20-22, 21-11తో జపాన్‌కు చెందిన హరుకో సుజుకిపై విజయం సాధించింది. గంటా తొమ్మిది నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి నుంచి దీటైన పోటీనెదుర్కొన్న సైనా ఆఖర్లో తన అనుభవాన్నంతా రంగరించి పైచేయి సాధించింది. ఫైనల్లో చోటుకోసం స్థానిక షట్లర్, 4వ సీడ్ బుసానన్ ఓంగ్‌బామ్‌రున్‌గాన్‌తో సైనా అమీతుమీ తేల్చుకోనుంది. ఇక సింగపూర్ ఓపెన్ చాంపియన్ సాయి ప్రణీత్ 21-16, 21-17తో స్థానిక ఆటగాడు కాంటాఫోన్ వాంగ్‌చరోన్‌ను ఓడించాడు. మూడోసీడ్ సాయి ప్రణీత్ సెమీస్‌లో థాయ్‌లాండ్‌కే చెందిన ఫనావిట్ తోంగ్‌వుమ్‌తో తలపడనున్నాడు. ఈ టోర్నీలో సైనా, ప్రణీత్ మినహా మిగతా భారత షట్లర్లంతా క్వార్టర్స్‌కు ముందే వెనుదిరిగారు.