తొలి మూవీ దర్శకుడితో 50వ చిత్రం!

తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడితో 50వ సినిమా చేయడం అరుదైన విషయం. అంతటి అదృష్టం తనకు దక్కినందుకు కాజల్‌ సంబరపడుతోంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ కాజల్‌ నటించిన 50వ చిత్రం. ఆమె తొలి చిత్రం ‘లక్ష్మీ కల్యాణం’ తెరకెక్కించిన తేజ ఈ సినిమాకు కూడా దర్శకుడు. ఈ అంశాన్ని గురించి కాజల్‌ మాట్లాడుతూ ‘‘ఏది నేర్చుకోకూడదో నేర్పిన దర్శకుడు తేజ. తాజా చిత్రంలో రాధ పాత్ర ఇచ్చారు. రాధ కేరక్టర్‌ చాలా వైవిధ్యంగా ఉంటుంది. రానా నాకు మంచి మిత్రుడు. స్నేహితులతో పనిచేసేటప్పుడు గొప్ప కంఫర్ట్‌ ఉంటుంది. ఈ చిత్రంలో నేను దాన్ని ఆస్వాదించాను. ప్రతి సన్నివేశాన్ని గురించి ఇద్దరం చర్చించుకునేవాళ్లం. నా పుట్టినరోజుకు ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాన్ని మించిన గిఫ్ట్‌ ఇంకేముంటుంది?’’ అని వివరించారు. అశుతోష్‌ రాణా, కేథరిన్‌ ట్రెస్సా, నవదీప్‌, పోసాని కృష్ణమురళి, జేపీ, రఘు కారుమంచి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌, బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సురేశ్‌బాబు, కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మించారు. డా.డి.రామానాయుడు సమర్పకులు.