తెలంగాణ ప్రభుత్వానికి మరో అవార్డు

యువతకు ఉపాధి కల్పించడంలో విశేష కృషి చేస్తున్న తెలంగాణను.. మరో పురస్కారం వరించింది. ఎంప్లాయ్‌ మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్  మిషన్‌ లో భాగంగా రాష్ట్రానికి జాతీయ స్థాయి అవార్డు దక్కింది. దీన్‌ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కార్యక్రమంలో భాగంగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ నెల 19న న్యూ ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా రాష్ట్ర పంచాయత్  రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు లేఖ అందింది.

తెలంగాణకు కేంద్ర పురస్కారం దక్కడం పట్ల మంత్రి జూపల్లి కృష్ణారావు సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధి శిక్షణ కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. రానున్న రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలోనూ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సెర్ప్, ఈజీఎంఎంలు కూడా ఈ ఏడాది కేంద్ర పురస్కారాలు దక్కించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీడీయూజీకేవై  కింద వేలాది మంది శిక్షణ పొందారు. యువతకు ట్రైనింగ్‌ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చూపుతున్న చొరవపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.