తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సిద్ధం

తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబురానికి సర్వం సిద్ధమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లోనూ పండుగలా వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే పల్లె నుంచి పట్నం దాకా అవతరణ సంబురాల కోలాహలం నెలకొంది. ఊరూ వాడా మొత్తం విద్యుత్ దీపాలు,  ప్రత్యేక డెకరేషన్ తో కళకళలాడుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ భారీ ఏర్పాట్లు చేశారు. అన్ని ప్రభుత్వ ఆఫీసులు, చౌరస్తాలు ఎక్కడ చూసినా ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడ లైటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండులో జరగనున్న రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఉదయం 10 గంటల 25 నిమిషాలకు ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండుకు చేరుకుంటారు. పదిన్నరకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పరేడ్ జరుగుతుంది. ఆ తర్వాత మార్చ్ ఫాస్ట్, రాష్ట్రస్థాయి పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరుగుతుంది. ఉదయం11 గంటల 18 నిమిషాలకు సీఎం ప్రసంగిస్తారు. అనంతరం పదకొండున్నరకు ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణమవుతారు.

రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ప్రతి జిల్లాలోనూ అమరవీరుల స్థూపాన్ని నిర్మిస్తున్నారు. అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ఘన నివాళి అర్పించనున్నారు. పోలీసు సిబ్బంది కవాతుతో పాటు విద్యార్థులు కూడా ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా తెలంగాణ కళారూపాల ప్రదర్శన జరగనుంది. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయి.

రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుకలు జరగనున్న ప్రాంతాల్లో  స్టేజీ, శానిటేషన్, సౌండ్స్, లైటింగ్ సిస్టమ్ ను సిద్ధం చేశారు. వేడుకల్లో జనం పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. కాబట్టి సంబురాలకు వచ్చే జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చైర్లు, తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.

అన్ని జిల్లాల్లో అవతరణ వేడుకల ఏర్పాట్లను ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రం సాధించుకున్న చారిత్రాత్మకమైన రోజున వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఏర్పాట్లు ఇప్పటికే తుదిదశకు చేరుకున్నాయి.