భావితరాలు గుర్తుంచుకునేలా సినారె స్మారకాల ఏర్పాటు

ప్రముఖ కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ సి.నారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఘన నివాళి అర్పించారు. ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం హైదరాబాద్ లోని సినారె ఇంటికి వెళ్లి ఆయన పార్థివదేహంపై పుష్పగుచ్చం ఉంచి, నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ సభ్యులందరితో ప్రత్యేకంగా మాట్లాడారు. సినారెను భావితరాలు గుర్తుంచుకునే విధంగా ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం సినారె ఇంటి వద్ద ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.

‘‘తెలంగాణ రాష్ట్రం చాలా గర్వంగా తల ఎత్తుకుని సినారె మా బిడ్డ అని చెప్పుకునేటంతటి మహానీయుడు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి పరమపదించిన సందర్భంలో నాయొక్క బాధను, దుఃఖాన్ని తెలియజేస్తున్నాను. చాలా గొప్ప కీర్తి శిఖరాలను అధిరోహించినటువంటి విశిష్టమైన సాహితీవేత్త. కవులు, రచయితలు చాలా మంది ఉంటరు కానీ, సినారె సభ అంటే సినారె మాట అంటే ఓ గ్లామర్. కవులకు గ్లామర్ ఉంటుందని నిరూపించిన వ్యక్తి సినారె. ఉపన్యాసం వినాలనే ఉత్సాహంతో వందలాదిగా సభలో పాల్గొనేవారు. ఆయన పుట్టింది తెలంగాణ గడ్డయినప్పటికీ, మొత్తం తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకోనేటటువంటి వ్యక్తి. ఆది ప్రాసలకు, అంత్య ప్రాసలకు అద్భుతమైన నడక నేర్పడంలో వారికి వారే సాటి. సినారెకు ఎవరూ పోటీలేరు. వారి ఆత్మకు పూర్ణ శాంతి చేకూర్చాలని నిండు మనసుతో భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునేటటువంటి ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని భగవంతుడు కలిగించాలని కూడా కోరుకుంటూ వారికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాను” అన్నారు.

“నారాయణరెడ్డి గారు తెలంగాణ సాహితీ మకుటంలో కలికితురాయి. వారిని ఎంత కీర్తించుకున్నా, పొగుడుకున్నా, ఎంత స్మరించుకున్నా తక్కువే. సాహిత్య రంగానికి వారు అందించిన విశేష సేవలు ఎనలేనివి. ఈ మధ్యనే నేను వరంగల్ పోయినపుడు సినారె రాసినటువంటి మందార మకరందాలు పుస్తకంలోని పద్యాలు బమ్మెర పోతన సమాధి వద్ద కోట్ చేయడం జరిగింది. అది సినారె గారు విన్నరని నాకు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. నాలాంటి అభిమానులు కోటానుకోట్ల మంది కలిగిఉన్నవారు సినారె. వారి అంత్యక్రియలలో పాల్గొనదల్చుకున్న వారికందరికీ కూడా అన్ని కేంద్రాలలో బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారిని తిరిగి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తాం” అని ప్రకటించారు.

“సినారె గారి స్మారక భవనానికి హైదరాబాద్ నగరం నడిబొడ్డున స్థలం కేటాయించి స్మారక మ్యూజియంతో పాటు సాహితి సమాలోచనలు జరుపుకునే విధంగా సమావేశ మందిరాన్ని కూడా వారి పేరిట ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓ ప్రముఖ సంస్థకు సినారె గారి పేరు చిరస్థాయిగా ఉండేలా పెట్టుకుంటాం. ట్యాంక్ బండ్ తో పాటు కరీంనగర్ పట్టణంలోనూ, సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనూ, వారి స్వగ్రామం హన్మాజీ పేటలోనూ ప్రభుత్వ పరంగానే సినారె కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా వారు అతిగా ప్రేమించినటువంటి సారస్వత పరిషత్తుకు ప్రభుత్వం పూర్తి స్థాయి అండదండలు ఇస్తుంది. సినారెకు ప్రభుత్వ పరంగా ఎంత ఘనంగా నివాళి అర్పించగలుగుతుందో అంత ఘనంగా అర్పించడానికి అన్ని చర్యలు కూడా తీసుకోబడతాయి. ఎవరైనా ఉత్తమోత్తమైన సలహాలు  ఇస్తే స్వీకరిస్తాం. వారి అంతిమయాత్రలో పాల్గొనాలని సాహితీవేత్తలను కోరుతున్నా’’ అని కేసీఆర్ చెప్పారు.

రేపు (బుధవారం) జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో జరిగే అంత్యక్రియలకు అన్ని జిల్లాల నుంచి సినారె అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తరఫున వారికి ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సాహితీ వేత్తలు, భాషాభిమానులు, సినారె అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎవరు అంతిమయాత్రలో పాల్గొనదలచినా, వారిని హైదరాబాద్ తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సిఎం స్పష్టం చేశారు. బస్సులు ఏర్పాటు చేసే బాధ్యతను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణలకు ముఖ్యమంత్రి అప్పగించారు. అంత్యక్రియల్లో తాను కూడా స్వయంగా పాల్గొంటానని, తెలంగాణ ప్రజల తరఫున సినారెకు గొప్ప వీడ్కోలు పలకాలని సిఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

సీఎం వెంట మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. అధికారిక లాంఛనాలతో సినారె అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.