తెలంగాణపై మళ్లీ విషం కక్కిన బాబు

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణపై విషం కక్కాడు. రాష్ట్ర ఏర్పాటును ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్న బాబు.. ఇక్కడ ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు జరుగుతుంటే ఓర్చుకోలేకపోతున్నాడు. జూన్ 2 ఏపీకి చీకటిరోజంటూ తన అక్కసును వెళ్లగక్కాడు. బాబు వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి.. పక్కరాష్ట్రంపై ఇంత నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేయడం ఆయన దిగజారుడుతనానికి అద్దం పడుతున్నది.

తెలంగాణ ఏర్పాటుకు అడుగడుడునా ఆటంకాలు సృష్టించిన చంద్రబాబు.. రాష్ట్రం ఏర్పడ్డా ఇంకా ఆ కడుపుమంట తగ్గడం లేదు. రాష్ట్ర ఏర్పాటును ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడు. రాష్ట్రం విడిపోయి 3 ఏళ్లయినా తెలంగాణపై బాబు కడుపుమంట చల్లారలేదు. ఏపీలో నవనిర్మాణ దీక్ష సందర్భంగా తన కపటబుద్ధిని బయటపెట్టుకున్నాడు. తెలంగాణలో టీడీపీ సమాధి అయిందన్న అక్కసుతో మరోసారి  విషం కక్కాడు.

ఇటలీ స్వాతంత్ర్య దినోత్సవం ఎప్పుడో తెలియకుండా చంద్రబాబు నోటికొచ్చింది మాట్లాడాడు. మార్చి 17 ఇటలీ స్వాతంత్ర్య దినోత్సవం అయితే.. జూన్‌ 2న అంటూ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు. తలుపులు మూసి టీడీపీ ఎంపీలను కొట్టి.. బిల్లు పాస్‌ చేసుకున్నారంటూ అడ్డదిడ్డంగా మాట్లాడ్డం బాబు ద్వంద్వనీతికి ప్రత్యక్ష నిదర్శనం.  పోలవరం ముంపు గ్రామాలు తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తి కాదని కేంద్ర ప్రభుత్వం దగ్గర పట్టుబట్టి ఏడు మండలాలను ఏపీలో కలిపించామని నిస్సిగ్గుగా చెప్పుకున్నాడు.

తెలంగాణ ఏర్పాటుపై విషం గక్కిన చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నాడు విభజనకు అడ్డుపడ్డ చంద్రబాబు.. ఇప్పడు అభివృద్దికి అడ్డుతగులుతున్నాడని తెలంగాణ నేతలు, జనం  మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై టీటీడీపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు శిఖండి మాటలపై.. టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని నిలదీస్తున్నారు.

ఏపీలో అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే.. బాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని తెలంగాణ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.