తెలంగాణకు ఐదు అవార్డులు

జాతీయ స్థాయిలో తెలంగాణకు అవార్డుల పంట పండింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం అమలులో రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచింది. అత్యుత్తమ ప్రగతి కనబరిచిన రాష్ట్రానికి.. జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు దక్కాయి. యువ‌త‌కు ఉపాధి శిక్షణ‌, అవ‌కాశాలు క‌ల్పించ‌డంలో విశేష కృషి చేసినందుకు దీన్‌‌ద‌యాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశ‌ల్య యోజ‌న అవార్డును తెలంగాణ ఎంప్లాయిమెంట్ జన‌రేష‌న్ అండ్ మార్కెటింగ్ మిష‌న్ కైవ‌సం చేసుకుంది. అలాగే జాతీయ స్థాయిలో నేష‌న‌ల్ రిసోర్స్ ఆర్గ‌నైజేష‌న్‌- నేష‌న‌ల్ రూర‌ల్ లైవ్లీహుడ్ మిష‌న్ ఉత్త‌మ అవార్డును తెలంగాణ సెర్ప్ సొంతం చేసుకుంది. ఢిల్లీ విజ్ఞాన్‌‌భ‌వ‌న్‌లో కేంద్ర మంత్రులు న‌రేంద్ర‌ సింగ్ తోమ‌ర్‌, రామ్‌ కృపాల్ యాద‌వ్‌ అవార్డులను ప్రదానం చేశారు. తెలంగాణ పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య‌దర్శి వికాస్ రాజ్, క‌మిష‌న‌ర్‌ నీతూ ప్రసాద్, సెర్ప్ సీఈవో పౌసమి బ‌సు అవార్డులు అందుకున్నారు.

ఉపాధి హామీ అమలులో తెలంగాణ మిగతా రాష్ట్రాల కంటే మెరుగైన ప్రతిభ కనబరిచింది. కోరిన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు అందించడం, వికలాంగులకు, ఆదిమ తెగలకు ప్రత్యేక జాబ్ కార్డులు జారీ చేయ‌డంతో పాటు కూలీలకు వేతన స్లిప్‌లను అంద‌జేయ‌డం, కూలీల ఖాతాలో వేత‌నాలు జ‌మ‌కాగానే ఎస్ఎంఎస్ పంపడం, సోషల్ ఆడిట్ కార్యక్రమాలు సమర్ధంగా నిర్వహించడం, ఉపాధి పనుల గురించి కరపత్రాల ద్వారా ప్ర‌చారం, ప్రత్యేక గ్రామీణ అభివృద్ధి కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారం వంటి కార్యక్రమాల్లో తెలంగాణ అత్యుత్తమంగా పనిచేసింది. ఇందుకు గాను జాతీయ స్థాయిలో పారదర్శకత, జవాబుదారీత‌నం కేటగిరీ కింద తెలంగాణ అవార్డును కైవ‌సం చేసుకుంది. అలాగే ఈ పథకం కింద నిర్మించిన అన్ని ఆస్తులకు భువన్ సాఫ్ట్ వేర్ ద్వారా జియో ట్యాగ్ చేసి అత్యంత ఎక్కువ ఆస్తుల వివరాలను కంప్యూటరీకరించినందుకు మ‌రో జాతీయ అవార్డు కూడా తెలంగాణకు దక్కింది. అత్యంత ఎక్కువ మంది కూలీల‌కు ఉపాధి కల్పన, కూలీలకు సకాలంలో వేతనాలు, అత్య‌ధిక సరాసరి వేతనం చెల్లించినందుకు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవ‌న్ పాటిల్ అవార్డు అందుకున్నారు. ఉపాధి హామీలో క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రించి, గ్రామ౦లో ఉన్న కూలీలలో ఎక్కువ మందికి పని కల్పించినందుకు నిజామాబాద్ జిల్లా మనోహరాబాద్ గ్రామ సర్పంచ్ తిరుపతి రెడ్డి అవార్డు తీసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో పని చేసిన కూలీలకు సకాలంలో వేత‌న‌ చెల్లింపులు చేసినందుకు నిజామాబాద్ జిల్లా డిచ్‌ప‌ల్లి మండ‌లం ఇంద‌ల్‌వాయి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అబ్దుల్ స‌త్తార్ అవార్డు అందుకున్నారు.

డీడీయూ-జీకేవై, ఎన్ఆర్వో-ఎన్ ఆర్ ఎల్ యం కేట‌గిరీల్లో మ‌రో రెండు అవార్డులు కూడా తెలంగాణకు ద‌క్కాయి. ఎక్కువ మంది యువ‌త‌కు నైపుణ్య శిక్ష‌ణ, ఉపాధి అవకాశాలు           క‌ల్పించిన రాష్ట్రంగా తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. 2015-16కు గాను ఈ అవార్డులను ప్రదానం చేశారు. అటు అవార్డు గ్రహీత‌ల‌ను పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అభినందించారు. రానున్న రోజుల్లో ప్ర‌తి విభాగంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.