తమన్నా మూవీలో ప్రభాస్‌ కీ రోల్!  

దక్షిణాది చిత్రసీమ నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నవతరం కథానాయికల్లో తమన్నా మాత్రమే నిలదొక్కుకున్నది. గ్లామర్, అభినయంతో తెలుగు, తమిళంతో పాటు హిందీ చిత్రసీమలో ప్రతిభను చాటుతున్నది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ఖామోషీ పేరుతో ఓ హిందీ చిత్రం రూపొందుతున్నది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభుదేవా కీలక పాత్రను పోషిస్తున్నారు. మహిళా ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అతిథి పాత్రలో హీరో ప్రభాస్ నటించనున్నట్లు తెలిసింది. బాహుబలి చిత్రంతో విజయవంతమైన జోడీగా గుర్తింపును తెచ్చుకున్నారు ప్రభాస్, తమన్నా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కటి వసూళ్లను సాధించడమే కాకుండా హిందీలో ప్రభాస్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. దాంతో ఈ కాంబినేషన్‌ను ఖామోషీలో పునరావృతం చేస్తున్నట్లు తెలిసింది. తమన్నాతో ఉన్న స్నేహం కారణంగా ప్రభాస్ ఈ సినిమాలోని అతిథి పాత్రలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. తమిళ చిత్రం కొలైయుథీర్ కాలమ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నది.