తగ్గిన బంగారం, వెండి ధరలు

పసిడి ధరలు మరింత తగ్గాయి. గడిచిన మూడు రోజులుగా తగ్గుతున్న బంగారం ధర ఢిల్లీ బులియన్ మార్కెట్లో రూ.55 తగ్గి రూ.29,370కి చేరుకుంది. వెండి ధర రూ.40 వేల దిగువకు జారుకుంది. కిలో వెండి ధర రూ.225 తగ్గి రూ.39,900 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, దేశవ్యాప్తంగా కొనుగోలుదారుల నుంచి ఆభరణాలకు మద్దతు లభించకపోవడంతో ధరలు దిగువముఖం పట్టాయని ట్రేడ్‌ వర్గాలు వెల్లడించారు. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి మద్దతు లభించకపోవడంతో వెండి ధర భారీగా పడిపోయిందన్నారు. రూపాయితో పోలిస్తే డాలర్ బలపడుతుండటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఇతర వాటివైపు మళ్లించడంతో అతి విలువైన లోహాల ధరలు తిరోగమన బాట పట్టాయి. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 0.88 శాతం తగ్గి 1,266.40 డాలర్ల వద్ద ముగిసింది. అలాగే వెండి ధర 1.35 శాతం క్షీణించి 17.17 డాలర్ల వద్ద స్థిరపడింది.