ఢిల్లీలో బోనాల సందడి

దేశ రాజధాని ఢిల్లీలో బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణకే ప్రత్యేకమైన బోనాల పండుగను ఢిల్లీలో జరుపుతున్నారు. ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు బోనాలతో ఊరేగింపు జరిపారు. తెలంగాణ భవన్ లో అమ్మవారి ఘట స్థాపన జరిపారు.

హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాల సమర్పణ, పోతురాజు స్వాగత కార్యక్రమాలు రేపు ఉంటాయి. బోనాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు దాదాపు వంద మంది కళాకారులు ఢిల్లీ చేరుకున్నారు.

ఊరేగింపులో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, తెలంగాణ భవన్ అధికారులు పాల్గొన్నారు.