ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ చివరి సమావేశం!

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇవాళ ఢిల్లీలో జరుగనున్నది. వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకున్నది. బహుశా ఇదే చివరి సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి అన్ని రాష్ర్టాల ఆర్థికమంత్రులు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ హాజరవుతారు. జీఎస్టీ పరిధిలోకి వచ్చే దాదాపు 90% వస్తువులపై ఎంత మేరకు పన్ను విధించి ఏ శ్లాబ్‌లో చేర్చాలన్నదానిపై స్పష్టత వచ్చినప్పటికీ కొన్ని రంగాల ప్రతినిధులు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసి పన్నును తగ్గించాలని కోరారు. ఈ నేపథ్యంలో జరిగే సమావేశంలో పలు వస్తువులు, సేవలపై పన్నుల్ని మార్చడం, ముసాయిదా మార్గదర్శకాలకు స్వల్ప సవరణలు చేయడం తదితరాలపై ప్రధాన చర్చ జరుగనుంది.