డోర్నకల్ లో లక్ష ఎకరాలకు సాగునీరు

సీఎం కేసీఆర్ మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన డోర్నకల్ నియోజకవర్గం మరిపెడలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు.

డోర్నకల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని హరీశ్ రావు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని చెప్పారు. కాళేశ్వరం ద్వారా పూర్వపు వరంగల్ జిల్లా సస్యశ్యామలం కాబోతుందన్నారు. సీఎం కేసీఆర్ పట్టుదలతో ఎస్ఆర్ఎస్పీ కాలువలు మరమ్మత్తు చేసి, కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ప్రతి చెరువును నిడుకుండలా చేయబోతున్నామని మంత్రి వివరించారు.

కాంగ్రెస్ పేరు చెబితే కరెంట్ కోతలు, విత్తనాలు-ఎరువుల కోసం క్యూ లైన్లు గుర్తుకు వస్తాయమని హరీశ్ రావు విమర్శించారు. రైతులకు పెట్టుబడి, సాగునీరు  ఇచ్చి వారి కష్టాన్ని తీర్చబోతున్నామని తెలిపారు. మహిళాభ్యున్నతికి ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డెలివరికి 13 వేల ఆర్థిక సహాయం, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళలతో పాటు వృద్ధులు, వికలాంగులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు పెన్షన్ వంటి సంక్షేమ పధకాలు అమలు చేస్తోందని వివరించారు. వచ్చే దసరా నుండి బతుకమ్మ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేయబోతున్నామని వెల్లడించారు.

ఈ సభలో జడ్పీ చైర్ పర్సన్ జి.పద్మ, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.