డిండి పనులు పరిశీలించిన ట్రీ బృందం    

నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో సుమారు మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. సుమారు రూ.6 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో ఐదు రిజర్వాయర్లు, దాదాపు 60 కిలోమీటర్ల ప్రధాన కాలువ పనులకు టెండర్లు పూర్తయి, పనులు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం నాలుగు రిజర్వాయర్ల పనులు కొనసాగుతున్నాయి. త్వరలో ప్రధాన కాలువ పనులు కూడా మొదలుకానున్నాయి.

అటు శివన్నగూడెం, కిష్టరాంపల్లి, గొట్టిముక్కల, సింగరాజుపల్లి రిజర్వాయర్ల పనులను పరిశీలించిన ట్రీ బృందం పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీర్లు, పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు దీనిని ఒక దైవకార్యంగా భావించాలని ట్రీ ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి సూచించారు. దశాబ్దాలుగా గరళాన్ని తాగుతున్న ఈ ప్రాంత ప్రజలకు, భావి తరాలకు సురక్షితమైన సాగు, తాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నందున ఇందులో భాగస్వాములు కావడం గొప్ప అదృష్టమన్నారు.

డిండి ప్రాజెక్టుపై తమ నివేదికలో ట్రీ బృందం ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయనుంది. దీని ప్రకారం  గతంలో డిండి ప్రాజెక్టుకు నీటిని సేకరించే అలైన్‌మెంట్‌లో మార్పులు చేస్తుండటంతో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు జిల్లాల్లో 20వేల ఎకరాలకు అదనంగా సాగునీరు ఇచ్చే అవకాశం వస్తుంది. రూ.200 కోట్ల మేర అంచనా వ్యయం ఆదా కూడా అవుతుంది. ఈ ప్రాజెక్టుద్వారా ముందుగా ప్రతిపాదించిన మూడున్నర లక్షల ఎకరాలతోపాటు అచ్చంపేట, అమ్రాబాద్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో సుమారు మరో లక్ష ఎకరాలకు నీరిచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తున్నందున ప్రాజెక్టుకు నీటి కేటాయింపు పెంచాలి.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌కు ఈ ప్రాజెక్టును అనుసంధానిస్తున్నందున.. పాలమూరు ప్రాజెక్టులో రెండు టీఎంసీలకు బదులుగా మరో మోటారును ఏర్పాటు చేస్తే 2.75 టీఎంసీలను తీసుకోవచ్చు. అందుకే ఇప్పుడే ఆ మేరకు సివిల్ పనులు చేపట్టాలి. పాలమూరు-రంగారెడ్డికి రెండు టీఎంసీలు, డిండికి 0.75 టీఎంసీలను తీసుకోవడం వల్ల గతంలో ప్రతిపాదిత ఆయకట్టుతో పాటు ప్రభుత్వం యోచిస్తున్న ఆయకట్టుకు కూడా సాగునీరు ఇవ్వవచ్చు.

శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ పథకం పనులను కూడా ట్రీ బృందం పరిశీలించింది. శ్రీశైలం నుంచి చందంపేట మండలం తెల్దేవర్‌పల్లి వరకు పది మీటర్ల డయాతో 43.9 కిలోమీటర్ల మేర టన్నెల్-1 నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇది పూర్తయితే శ్రీశైలం నుంచి భూమ్యాకర్షణ శక్తి ద్వారా నాలుగు వేల క్యూసెక్కుల కృష్ణాజలాలు నల్లగొండ జిల్లాకు తరలివస్తాయి. టన్నెల్ బోరింగ్ మిషన్‌తో కొనసాగుతున్న ఈ పనులను పరిశీలించిన బృందానికి ఇప్పటివరకు సుమారు 29 కిలోమీటర్ల మేర పని పూర్తయినట్లుగా అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నెలకు సుమారు 300-400 మీటర్ల మేర పనులు చేస్తున్నందున టన్నెల్ పూర్తికి మరో మూడేండ్లు పట్టే అవకాశముందని గుర్తించారు. ప్రాజెక్టులో భాగంగా 7.4 టీఎంసీల సామర్థ్యంతో నక్కలగండి రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిని త్వరగా పూర్తి చేస్తే టన్నెల్ పూర్తయ్యేవరకు అప్పర్ డిండి నుంచి వచ్చే మిగులు జలాల ద్వారా ఈ రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేసుకునే అవకాశముందని ట్రీ బృందం అభిప్రాయపడింది. దీంతో వచ్చే ఏడాది డిసెంబరులోగా రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తామని ప్రాజెక్టు అధికారులు బృందానికి తెలిపారు.

ఎస్‌ఎల్బీసీలో భాగంగా నిర్మిస్తున్న 7.1 కిలోమీటర్ల టన్నెల్-2 నిర్మాణం, 2.20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న పెండ్లిపాకల రిజర్వాయర్ పనులను కూడా పరిశీలించారు. అనంతరం ఏఎమ్మార్పీ లోలెవల్ కెనాల్ పనులను, ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని ట్రీ బృందం పరిశీలించింది. ట్రీ బృందం కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి పూర్వ నల్లగొండ జిల్లా పరిధిలో జరుగుతున్న ప్యాకేజీ-15, 16 పనులను పరిశీలించింది. రెండు చోట్ల మూసీపై అక్విడక్ట్‌ల నిర్మాణం సుమారు రెండేండ్ల కిందటే పూర్తి కావడం విశేషమని, ఇది రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే సాధ్యమైనందని ట్రీ బృందం సభ్యులు అన్నారు. రెండు ప్యాకేజీల్లోని కాల్వల నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత బస్వాపూర్ గంధమల్ల రిజర్వాయర్ ప్రతిపాదిత ప్రాంతాలను సందర్శించారు. బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి హైలెవల్ కెనాల్ ద్వారా 30వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు డిజైన్ రూపొందించారు. దీనిపై ట్రీ బృందం ప్రత్యేక దృష్టిసారించి చర్చించింది. బస్వాపూర్ హైలెవల్ కెనాల్‌ను మూసీ దాటించడంవల్ల భవిష్యత్తులో కృష్ణా బేసిన్‌లో ఇన్‌ఫ్లో లేకపోతే డిండి ఎత్తిపోతల పథకంలోని కీలకమైన, 12 టీఎంసీల సామర్థ్యంతో ఉండే శివన్నగూడెం రిజర్వాయర్, లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపడుతున్న ఉదయ సముద్రంకు కూడా గోదావరిజలాలను మళ్లించవచ్చని ప్రతిపాదిస్తున్నారు.

ఒక దాని పక్కన మరోటి పేర్చినట్లుగా ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఈ గుట్టలు.. రిజర్వాయర్ల నిర్మాణంలో ప్రజాధనాన్ని ఎంతగానో ఆదాయ చేయనున్నాయి. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న శివన్నగూడెం రిజర్వాయర్ మొదలు.. సింగరాజుపల్లి రిజర్వాయర్ వరకు దాదాపుగా అన్నీ ఈ గుట్టల ఆధారంగానే నిర్మించేలా డిజైన్ రూపొందించారు.