ట్రావెల్‌ బ్యాన్‌ ఆర్డర్‌లో కొత్త నిబంధనలు

ట్రావెల్‌ బ్యాన్ విషయంలో సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇదే జోరులో ఆరు ముస్లిం దేశాల పౌరుల విషయంలో  కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అమెరికాలోని వ్యాపారాలు లేదా కుటుంబాలతో సంబంధమున్న శరణార్థులందరికి.. మరీ ముఖ్యంగా ఆరు ముస్లిం దేశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు ట్రంప్‌ కార్యాలయం స్పష్టం చేసింది.

కొత్త నిబంధనల ప్రకారం ఇప్పటికే జారీచేసిన వీసాలను మాత్రం రద్దు చేయమని తెలిపింది. సిరియా, సుడాన్‌, సోమాలియా, లిబియా, ఇరాన్‌, యెమెన్‌ ప్రాంతాల నుంచి అప్లయ్‌ చేసుకునే కొత్త వీసాదారులకు కొత్త నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ఈ నిబంధనలు గురువారం నుంచే ఆమల్లోకి రానున్నాయి. జర్నలిస్టులు, విద్యార్థులు, వర్కర్లు, లెక్చరర్లు సరియైన ఆహ్వానంతో వస్తే, లేదా ఎంప్లాయిమెంట్‌ కాంట్రాక్ట్‌ తో అమెరికాను సందర్శించాల్సి వస్తే వారికి  ట్రావెల్‌ బ్యాన్‌ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రంప్ ఆరు ముస్లిం దేశాలపై ట్రావెల్‌బ్యాన్‌ విధించారు. దీనిపై అమెరికాలో వ్యతిరేకత వచ్చింది. ఈ అంశం కోర్టుల వరకు వెళ్లింది. కింది కోర్టులు దీనిపై అభ్యంతరం తెలుపగా సుప్రీంకోర్టు మాత్రం ఓకే చెప్పింది. దీంతో అమెరికా భద్రత కోణంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం సంపూర్ణ విజయమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు.