ట్రంప్, మోడీ భేటీతో ఐటీకి మేలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోడీ భేటీ భారత ఐటీ పరిశ్రమకు మరింత ఊతమివ్వనున్నదని ఇండస్ట్రీ బాడీ అసోచామ్ అభిప్రాయపడింది. 150 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న దేశీయ సాఫ్ట్‌వేర్, సేవల రంగానికి ఈ భేటీ కీలకంగా మారింది. ఇరుదేశాల మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలు ఐటీతోపాటు ఇతర రంగాల పురోభివృద్ధికి తోడ్పాటునందించనున్నదని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్యానికి అనుకూలిస్తుందని, ముఖ్యంగా వ్యవసాయం, ఐటీ, తయారీ రంగాలు మెరుగైన వృద్ధికి దోహదపడుతుందని ఆయన వెల్లడించారు. అలాగే ఎగుమతులు పెరుగుతాయని, వ్యాపార లావాదేవీలు మరింత బలపడుతాయని చెప్పారు. ఐటీ తర్వాత ఇరు దేశాల మధ్య ఫార్మా రంగం కీలకంగా మారనున్నదన్నారు. యూఎస్-ఎఫ్‌డీఏతో దేశీయ ఫార్మా సంస్థలు పలు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని, ఈ భేటీతో కొన్నింటికి పరిష్కారం లభించనున్నదని ఆయన తెలిపారు.