ట్రంప్ తో సుధీర్ఘంగా భేటీ కానున్న మోడీ

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో సుధీర్ఘంగా భేటీ కానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామన 1.20 కి ట్రంప్ తో భేటీ కానున్నారు ప్రధాని. దాదాపు ఐదు గంటల పాటు ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చిస్తారు. ఒక దేశాధినేతతో ఇంత సుధీర్ఘంగా ట్రంప్‌ భేటీ కావడం ఇదే మొదటిసారని వైట్‌ హౌస్‌ వెల్లడించింది. వాణిజ్య సంబంధాలు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు, రక్షణ శాఖకు సంబంధించిన కీలకమైన విషయాలు వీరి భేటీలో చర్చకు రానున్నాయి. వైట్‌ హౌస్‌లోనే మోడీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు ట్రంప్‌. అక్కడే వీరిద్దరు కలిసి డిన్నర్‌ చేయనున్నారు. ట్రంప్‌ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓ దేశ ప్రధానితో కలిసి డిన్నర్ చేయడం కూడా ఇదే తొలిసారి. ఇప్పటికే ట్రంప్‌-మోడీ మూడుసార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు.