టెలిమెట్రీపై మళ్లీ మొదటికొచ్చిన కృష్ణాబోర్డు

కృష్ణా బోర్డు తెలంగాణపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోంది. టెలిమెట్రీ విధానం అమలుకు వెనకా ముందు అవుతోంది. దీంతో పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీ ఏర్పాటు కథ మళ్లీ మొదటికొచ్చింది. ఆంధ్రప్రదేశ్ సర్కారు కృష్ణాజలాలను అక్రమంగా తరలించుకుపోవడాన్ని నిలువరించేందుకు టెలిమెట్రీ విధానం అమలు చేయాలని తెలంగాణ  డిమాండ్ చేస్తోంది. అయితే  రెండు రాష్ర్టాల సంయుక్త సర్వేలోఅంగీకరించి, అధికారికంగా కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖకు పంపిన నివేదికలోనూ పేర్కొన్న 600 మీటర్ల పాయింట్‌ను మార్చేందుకు మళ్లీ కృష్ణాబోర్డు ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలోనూ బోర్డు ఇలాంటి ప్రయత్నం చేయగా తెలంగాణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనుకకు తగ్గింది. అయినా బోర్డు తన వైఖరి మార్చుకోలేదు.

కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి సమీర్ ఛటర్జీ ఈ అంశంపై తెలంగాణ అధికారులతో చర్చించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ఎస్ సునీల్‌తో పాటు ఇతర అధికారులు బోర్డు సభ్యకార్యదర్శితో మాట్లాడారు. గతంలో నిర్ణయించిన 600 మీటర్ల పాయింట్ వద్ద టెలిమెట్రీ ఏర్పాటు కుదురడంలేదని సభ్యకార్యదర్శి చెప్పినట్లు తెలిసింది. అయితే దీనికి తెలంగాణ అధికారులు అంగీకరించలేదు. ముఖ్యంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ తర్వాత అనేక చోట్ల కృష్ణాజలాల్ని తరలించుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పాలనలోనే పెద్దఎత్తున ఏర్పాట్లు చేసుకున్నది. ఈ క్రమంలో 500 మీటర్ల పాయింట్ నుంచి కూడా జలాలను తరలించుకుపోయినట్లుగా రికార్డులు ఉన్నాయి. ఈ కుట్రను గ్రహించిన తెలంగాణా 600 మీటర్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని వాదిస్తున్నది. కృష్ణాబోర్డు నిన్నటిదాకా ఇందుకు అంగీకరించినా మళ్లీ ఏపీ సర్కారుకు అనుకూలంగా వ్యహరిస్తున్నది.అంగీకరించిన చోటు కంటే 11 కిలోమీటర్ల దిగువన టెలీమెట్రీ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది. తెలంగాణా ససేమిరా అనడంతో ఆ నిర్ణయాన్ని బోర్డు సభ్యకార్యదర్శి ఉపసంహరించుకున్నారు. అయినా తాజాగా మళ్లీ అదే ప్రతిపాదనను ముందుకు తేవడం అనుమానాలకు తావిస్తున్నది.

టెలీమెట్రీ కోసం రాడార్ వాటర్ లెవల్, రాడార్ వెలాసిటీ సెన్సార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే అవి నీటిలో ఉండటం వల్ల వాటిని ఎవరైనా టాంపరింగ్ చేసే అవకాశం ఉంటుందని తెలంగాణా అభ్యంతరం చెప్తున్నది. ఈ అంశంపై ఆలోచిస్తామని బోర్డు సభ్యకార్యదర్శి చెప్పినా దీనిపైనా తుది నిర్ణయం తీసుకోవడంలో నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు.