టీఆర్‌ఎస్‌ 6 అనుబంధ సంఘాలకు అధ్యక్షులు

టీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకం ఊపందుకుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ పార్టీకి చెందిన మరో ఆరు అనుబంధ సంఘాలకు అధ్యక్షులను నియమించారు. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ను నియమించారు. మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా మహ్మద్ ఖాజా ముజీబుద్దీన్  , ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా సుంక రవిశంకర్  , రైతు విభాగం అధ్యక్షుడిగా కంచర్ల రామకృష్ణారెడ్డి  ,బీసీ విభాగం అధ్యక్షుడిగా ముఠా గోపాల్  , కార్మిక విభాగం అధ్యక్షుడిగా జీ రాంబాబు యాదవ్  ను నియమించారు. ఇటీవలే పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా గుండు సుధారాణి, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ ను నియమించారు. ఇదే క్రమంలో ఎస్టీ, వాణిజ్య, లీగల్ విభాగాలకు కూడా అధ్యక్షులను ప్రకటించనున్నారు.

 

ఏప్రిల్‌లో జరిగిన ప్లీనరీలో కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కాగా పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆ వేదికపై ప్రకటించారు. పార్టీ నాయకులతో సంప్రదింపులు, సమాలోచనల తరువాత నియామకాలను చేపట్టారు.అధ్యక్షుల నియామకం పాత కొత్తల కలయికగా సాగింది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి పదవులు ఇస్తూనే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికీ సముచితస్థానం కల్పించారు సీఎం కేసీఆర్‌.  ఇదిలా ఉంటే ప్రభుత్వ పరిధిలో ఉండే నామినేటెడ్ పదవుల నియామకాలు ఎక్కువభాగం పూర్తయ్యాయి. ఇక పార్టీ పదవులు పూర్తి చేసి క్షేత్రస్థాయిపై దృష్టిపెట్టాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర కమిటీ, పొలిట్‌బ్యూరోల నియామకాలపై ఆయన కసరత్తు ప్రారంభించారు. ఈ కమిటీలను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

పార్టీ విధాన నిర్ణయాలు తీసుకోవడంలో కీలకమైన పొలిట్ బ్యూరోను గతంలో మాదిరిగా జంబో కమిటీలా కాకుండా పరిమిత సభ్యులతో ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర కమిటీపై కసరత్తు చురుగ్గా సాగుతున్నదని… అతి త్వరలో ప్రకటన ఉంటుందని చెప్తున్నారు. అయితే రాష్ట్ర కమిటీలోకి ప్రభుత్వ పదవులు ఉన్నవారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి స్థానం ఉండదని తెలిసింది. ఏ పదవీ లేని వారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. కమిటీకి జిల్లాల నుంచి పేర్ల కూర్పు ఒక దశకు చేరిందని సమాచారం. ఇదిలా ఉంటే నామినేటెడ్ పదవుల్లో భాగంగా త్వరలోనే అన్ని జిల్లాల గ్రంథాలయ సంస్థలకు పాలకవర్గాలను కూడా నియమించనున్నారు.