టాలెంట్‌ లేకపోతే అంతే!

సినీ వారసులు పరిశ్రమలో సులభంగా రాణిస్తారనేది కేవలం అపోహ మాత్రమే అని చెప్తోంది శృతిహాసన్. వారసులు అనే అర్హత చిత్రసీమలో ప్రవేశానికి మాత్రమే పనిచేస్తుందని, కెరీర్‌లో విజయం సాధించాలంటే స్వీయ ప్రతిభ ముఖ్యమంది. ఆమె కథానాయికగా నటించిన బహెన్ హోగీ తేరి చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సినిమాను తన తండ్రి కమల్‌హాసన్‌తో కలిసి ప్రత్యేకంగా వీక్షించింది శృతిహాసన్.  “ఇతర రంగాలతో పోల్చితే సినీరంగం చాలా భిన్నంగా వుంటుంది. కేవలం కుటుంబ పేరుప్రఖ్యాతులతో ఇక్కడ విజయాల్ని సాధించడం అంత ఈజీ కాదు. తొలుత అవకాశాలు సంపాదించడానికి వారసత్వం ఉపయోగపడుతుంది. మనలో ప్రతిభలేదని తెలిసిపోతే ఎంతటి నేపథ్యమున్నా అవకాశాలు ఇవ్వడానికి వెనకడుగువేస్తారు. అందుకు సినీరంగంలో ఎన్నో ఉదాహరణలున్నాయి. కోట్లతో ముడిపడివున్న వ్యాపారం కాబట్టి ఇక్కడ వ్యక్తిగత ప్రతిభాపాటవాల్నే ప్రామాణికంగా భావిస్తారు. నాలో ప్రతిభ లేకపోతే ఇన్నాళ్లుగా కెరీర్‌లో కొనసాగేదాన్ని కాదు. నిజమైన టాలెంట్ వుంటే ఎలాంటి నేపథ్యం లేకున్నా పరిశ్రమలో రాణించవొచ్చు” అని ఈ సందర్భంగా చెప్పింది. తాను నటించిన దాదాపు అన్ని సినిమాల్ని నాన్నకు చూపిస్తానని, తన సినిమాలకు ఆయనే పెద్ద విమర్శకుడని తెలిపింది.