జోనల్ వ్యవస్థ రద్దుని స్వాగతిస్తున్నాం

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జోనల్‌ వ్యవస్థ రద్దును తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు స్వాగతించారు. జోనల్‌ వ్యవస్థ రద్దుపై అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ సచివాలయంలో సమావేశం అయ్యారు. సూపరింటెండెంట్‌ స్థాయి ఉద్యోగాలు జిల్లా పోస్టులుగానే ఉండాలని.. స్థానిక రిజర్వేషన్ల విధానం పటిష్టంగా అమలు కావాలని అభిప్రాయపడ్డారు. రిక్రూట్‌మెంట్లు అధికంగా జిల్లాల వారీగానే జరగాలని ఉద్యోగ సంఘాల నేతలు సూచించారు.

శాఖల వారీగా అన్ని పోస్టులను సమీక్షించాలని, ముసాయిదాపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఖరారు చేయాలని టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్ రెడ్డి కోరారు. జోనల్ వ్యవస్థ రద్దు వల్ల ఉద్యోగులు రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేసే అవకాశం లభిస్తుందన్నారు. బదిలీలు సహా ఏపీలో పనిచేస్తోన్న ఉద్యోగుల అంశంపై రేపటి సమావేశంలో చర్చిస్తామని చెప్పారు.

జోనల్ విధానం రద్దు వల్ల ప్రస్తుత ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగదని టీజీవో అధ్యక్షురాలు మమత చెప్పారు. కొత్తగా నియామకాలు చేపట్టే 65 పోస్టులకు మాత్రమే కొత్త విధానం వర్తిస్తుందన్నారు. రాష్ట్ర స్థాయి పోస్టులు కూడా అధికంగా తెలంగాణలో పుట్టిన వారికే దక్కేలా 80:20 విధానం అమలు చేయాలని కోరామన్నారు.

కాగా, అన్ని సంఘాల నేతలతో రేపు మరోసారి సమావేశం కావాలని సీఎస్ నిర్ణయించారు.