జెట్టింగ్ మిషన్లతో మురుగునీటి నిర్వహణ

జీహెచ్ఎంసీలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది. డ్రైనేజ్ క్లీనింగ్ లో కొత్త సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  మ్యాన్ హోల్స్ లో కార్మికులు దిగి పనిచేయాల్సిన అవసరం లేకుండా జెట్టింగ్ మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రప్రభుత్వ చొరవతో మానవరహిత మురుగునీటి నిర్వహణకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంది. పుణె నుంచి ఈ ఆధునిక జెట్టింగ్ మిషన్లను దిగుమతి చేసుకున్నారు. హైదరాబాద్  నెక్లెస్‌రోడ్డులో 70 మిషన్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, మేయర్ బొంతు రామ్మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురుగునీటి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్మికులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా  తీర్చి దిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సీవరేజ్‌ కార్మికుల గౌరవాన్ని కాపాడేందుకు.. అత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. అవసరమైతే మరిన్ని వాహనాలను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారాయన. దళిత పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్.

జెట్టింగ్ మిషన్లను అందుబాటులోకి తేవడంపై డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అటు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్.

జెట్టింగ్ మిషన్ల ప్రారంభోత్సవంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మానవ రహిత మురుగునీటి నిర్వహణకు చొరవ చూపిన మంత్రి కేటీఆర్ కు గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.