జూలై 1 నుంచే జీఎస్టీ అమలు

షెడ్యూలు ప్రకారంగా జూలై 1 నుంచే దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టం అమల్లోకి వస్తుందని, వాయిదా వేసే ఆలోచన ఎంతమాత్రం లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. జీఎస్టీని అమలు చేయడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని, అన్ని రాష్ర్టాల సహకారం కూడా సంతృప్తికరంగా ఉందని తెలిపింది.  జూలై 1 నుంచి జీఎస్టీ అమలు కష్టసాధ్యమేనని కొన్ని వార్తలు, ఊహాగానాలు వస్తున్నాయని, వీటిని నమ్మవద్దని, అవి పుకార్లేనని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. జీఎస్టీని అమలు చేయడానికి అన్ని విభాగాల యంత్రాంగాలు సిద్ధంగా ఉన్నాయని, సన్నాహక చర్యలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయని, వాయిదా వేయాల్సిన అవసరమే లేదని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా స్పష్టం చేశారు. కొత్త పరోక్ష పన్నుల చట్ట అమలును వాయిదా వేయాల్సిందిగా కొన్ని వ్యాపార వర్గాలు జీఎస్టీ మండలిని కోరిన మాట వాస్తవమేనని, పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి మిత్రా కూడా కనీసం నెల రోజుల పాటు వాయిదా వేయాలని కోరారన్నారు. కానీ ఆ అవసరం లేదని, యధావిధిగా జూలై 1 నుంచే జీఎస్టీ అమలవుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు (సీబీఈసీ) ఇప్పటికే అన్ని రాష్ర్టాలతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నదని, జీఎస్టీ ఏర్పాట్లను సమీక్షిస్తున్నదని, అన్ని రాష్ర్టాలలో జరుగుతున్న ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వ్యాపారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు ఇతర సన్నాహక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా రాష్ర్టాలకు సీబీఈసీ తగిన ఆదేశాలు జారీ చేసిందని హస్ముఖ్ అధియా గుర్తుచేశారు.