జూరాలకు జలకళ

జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. గత ఏడాది ఇదే సమయంలో జూరాల ప్రాజెక్టులో 2.76 టీఎంసీల నీటి నిల్వ ఉండేది. కానీ ఈసారి 7 టీఎంసీల నీటి నిల్వతో ప్రాజెక్టు కళకళలాడుతున్నది. ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతుండటంతో కొద్ది రోజుల్లోనే పూర్తిస్థాయిలో నిండుతుందని అధికారులు, ప్రాజెక్టు ఇంజినీర్లు చెబుతున్నారు.

జూరాలకు వరద నీరు వస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల మొదలైంది. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్‌కు 556 క్యూసెక్కులను విడుదల చేశారు. ఉంద్యాల, తీలేరు ఎత్తిపోతల ద్వారా ఈ నీరు కోయిల్‌సాగర్ చేరనున్నది. వారం రోజుల్లో భీమా, సమాంతర కాల్వ, నెట్టెంపాడు కాల్వలకు కూడా నీటిని విడుదల చేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

కృష్ణా నదికి వస్తున్న వరదను గమనించిన సీఎం కేసీఆర్.. ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పటికీ పాలమూరులో ఉన్న ఎమ్మెల్యేలతో ఫోన్‌లో మాట్లాడారు. వరద జలాలను సద్వినియోగం చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనైనా రిజర్వాయర్లు, చెరువులను నింపుకోవాలని సూచించారు. దీంతో గత బుధవారం సీఎం నుంచి ఫోన్ ద్వారా ఆదేశాలు అందుకున్న ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, చిట్టెం రామ్మెహన్‌రెడ్డిలు అప్రమత్తమై జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి లక్ష్మారెడ్డి చేత జూరాల బ్యాక్‌వాటర్ నుంచి నీటిని తరలించి ఉంద్యాల లిఫ్ట్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత తీలేరు వద్ద ఉన్న రెండో లిఫ్ట్‌ను ప్రారంభించి కోయిల్ సాగర్ రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్ చేస్తున్నారు.

వరుసగా నాలుగేళ్లలో ఇంత ముందస్తుగా జూరాలకు నీరు రావడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. నాలుగేళ్లలో ప్రాజెక్టులోకి చాలా ఆలస్యంగా నీరు రావడం, ఆయకట్టు రైతుల్లో ఆందోళన కలిగించేది. దీంతో నీటి విడుదల చేస్తారా? ఆయకట్టులో పూర్తిస్థాయికి నీళ్లు అందుతాయా..? అనే ప్రశ్నలతో రైతులు సేద్యం పనులకు వెళ్లేవాళ్లు. 2015  జూన్ 27 నాటికి నీటి నిల్వ 2.89 టీఎంసీలు కాగా.. 2016  జూన్ 26 నాటికి 2.76 టీఎంసీల నీరు మాత్రమే నిల్వఉన్నట్లు అధికారిక రికార్డులనుబట్టి తెలుస్తోంది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 9.657 టీఎంసీలు కాగా, ఈసారి 7.001 టీఎంసీలకు జూరాల జలాశయం నీటిమట్టం పెరిగింది.  ఇంకా వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఈ వరద నీరు ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటోందని అధికారులు చెబుతున్నారు.