జీఎస్‌ఎల్‌వీ-3 కౌంట్‌ డౌన్ ప్రారంభం

శ్రీహరి కోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉపగ్రహం ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక ప్రయోగమైన జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3డీ1 వాహక నౌకను షార్‌ నుంచి సోమవారం పంపేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఈ మేరకు  జీఎస్‌ఎల్వీ-ఎంకే 3 కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం 5.38 గంటలకు జీఎస్‌ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్‌ ప్రపంచ దేశాల్లో నాలుగో దేశంగా నిలవనుంది. ఇస్రో చేపడుతున్న అత్యంత బరువైన ఉపగ్రహాల్లో ఇదో మొదటిది కావడం విశేషం. ఈ ఉపగ్రహ బరువు 3,136 కిలోలు. 18 ఏళ్లపాటు శ్రమించి జీఎస్‌ఎల్వీ -మార్క్‌ 3డీ1 రాకెట్‌ను శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. ఈ భారీ రాకెట్‌ ద్వారా అత్యంత బరువైన జీశాట్‌ -19 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. సమాచార వ్యవస్థ మరింత మెరుగుపడేందుకు, అంతర్జాల సేవలు మరింత వేగవంతమయ్యేందుకు ఈ ఉపగ్రహ ప్రయోగం దోహదపడుతుంది.