జీఎస్టీలోకి పెట్రోఉత్పత్తులు!

పన్నుల్లో భారీ సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో రూపొందించిన వస్తు, సేవా పన్ను(జీఎస్టీ) అమలు ప్రారంభంలో ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొనక తప్పదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. పరోక్ష పన్ను విధానంలో భాగంగా దీర్ఘకాలికంగా పన్ను ఎగ్గొట్టే వారి సంఖ్య భారీగా తగ్గనున్నదని, అలాగే ధరలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. వచ్చే రెండేండ్లకాలంలో రియల్ ఎస్టేట్, పెట్రోలియం ఉత్పత్తులను సైతం జీఎస్టీ పరిధిలోకి తీసుకురానున్నట్లు జైట్లీ సంకేతాలిచ్చారు. ఇందుకోసం జీఎస్టీ కౌన్సిల్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని చెప్పారు. ఇప్పటికే కిరోసిన్, నాప్తా, ఎల్‌పీజీలు జీఎస్టీ పరిధిలోకి రాగా..క్రూడాయిల్, సహజ వాయువు, జెట్ ఫ్యూయల్, డీజిల్, పెట్రోల్‌లకు మినహాయింపునిచ్చారు. పెట్రోలియం, ఆల్కహాల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నప్పటికీ.. పన్ను విధింపు విషయంలో రాష్ర్టాలు అధికారాలను వదులుకోవడానికి సిద్ధంగా లేవని జైట్లీ వెల్లడించారు. పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను విధింపును జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనున్నదన్నారు. జీఎస్టీ పరిధిలోకి సహజ వాయువును తీసుకొచ్చే విషయంపై త్వరలో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోబోతున్నది. ఒకవేళ సహజ వాయువు జీఎస్టీ పరిధిలోకి వస్తే చమురు, ఇంధన విక్రయ సంస్థలకు భారీ ఊరట లభించనున్నది. ప్రస్తుతం క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, సహజ వాయువులు కొత్త పరోక్ష పన్ను విధానంలోకి రాలేదు. జీఎస్టీ అమలుద్వారా అటు కేంద్రానికిగాని, ఇటు పారిశ్రామిక వర్గాలకుగాను ఎవరికి నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జీఎస్టీ పరిధి నుంచి ఐదు చమురు రంగ ఉత్పత్తులకు మినహాయింపునివ్వాలని గతంలో ఆర్థిక మంత్రిత్వ శాఖను చమురు మంత్రిత్వ శాఖ కోరింది. అరుణ్ జైట్లీ నేతృత్వం వహిస్తున్న జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. జీఎస్టీ అమలులోకి రానున్న కొద్ది గంటల ముందే అంటే జూన్ 30న కౌన్సిల్ మరోమారు సమావేశంకాబోతున్నది. సహజ వాయువును జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ప్రభుత్వరంగ ఇంధన సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ)తోపాటు ఐజీఎల్‌కు అధికంగా లాభం చేకూరనున్నది.