జీఎస్టీపై భయాందోళనలు వద్దు

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమలుకు సర్వం సిద్ధమైంది. రేపు (శుక్రవారం) అర్థరాత్రి నుంచి ఇది అమలు కానున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ జీఎస్టీపై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. జీఎస్టీపై ట్రేడర్స్ ప్రజల్లో భయాందోళనలు కలిగించొద్దని సూచించారాయన. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జీఎస్టీ అమలవుతుందన్నారు. జీఎస్టీతో గతంలో ఉన్న పలు రకాల పన్నులు రద్దయి.. ఒకే పన్ను విధానం అమల్లోకి వస్తుందన్నారు మంత్రి ఈటెల రాజేందర్.

జీఎస్టీతో సామాన్యుడిపై భారం పడకుండా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు మంత్రి ఈటెల రాజేందర్. ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, గ్రానైట్ పై జీఎస్టీ భారం వేయొద్దని కోరామన్నారు. ఆరు అంశాలపై కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాశారని చెప్పారు. తమ ప్రతిపాదనలు నెరవేర్చే వరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రజలపై భారం పడే పన్నులపై మరోసారి జీఎస్టీ కౌన్సిల్ లో చర్చిస్తామన్నారు ఈటెల.

జీఎస్టీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. అధికారులకు తగిన శిక్షణనిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు పన్నుల వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం ముందున్నదని మంత్రి ఈటెల తెలిపారు.

రేపు రాత్రి ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగే జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతామని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. జీఎస్టీ అమలుతో డీలర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెప్పారు.