జీఎస్టీపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ

ఒకే దేశం- ఒకే పన్ను నినాదంతో జీఎస్టీ చట్టం అమల్లోకి రానుంది. అయితే ఒకే పన్ను- లెక్క లేని సందేహాలు అన్నట్టు జీఎస్టీపై దేశమంతా ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా జీఎస్టీని అమలు చేస్తుంటే… మరోవైపు దేశవ్యాప్తంగా జనం గుండెల్లో గుబులు నెలకొంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వర్తకుల నుంచి జీఎస్టీపై నిరసనలు వ్యక్తమౌతున్నాయి. వేర్వేరు పన్నుల స్థానంలో ఒకే పన్ను విధించేందుకు ఉద్దేశించిన ఈ వ్యవస్థపై అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. జీఎస్టీ ఫలితం ఎలా ఉంటుంది, సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, ఏయే ధరలు పెరుగుతాయి, ఏవి తగ్గుతాయి…? వర్తకులు, వ్యాపారులపై జీఎస్టీ పెను ప్రభావాన్ని చూపించబోతోందా ? ఇలా ఎక్కడ చూసినా అన్ని వర్గాల్లో ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే జీఎస్టీ అమలు పై ఆందోళన వద్దని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. జీఎస్టీ అమలుకు తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉందని చెప్పారు. దీనిపై ప్రజలను వ్యాపారులను భయపెట్టవద్దని సూచించారు. జీఎస్టీ అమలుతో రాష్ట్రానికి ఏటా రూ.2 వేల నుంచి రూ.4 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని తెలిపారు.

 

జీఎస్టీ ప్రకారం మార్కెట్‌లో లభ్యమయ్యే ప్రతి వస్తు వుపై నాలుగు శ్లాబుల్లో మూడు రకాల పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. పెట్రోలియం ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులు, మద్యంను జీఎస్టీ నుంచి మినహాయించారు. కేంద్ర వస్తు సేవల పన్ను , రాష్ట్ర వస్తుసేవల పన్ను, సమీకృత వస్తుసేవల పన్నులను కలిపి జీఎస్టీగా వ్యవహరిస్తారు. జీఎస్టీలో నిర్ణయించిన పన్ను శ్లాబుల్లో ఈ మూడు రకాల పన్నులూ కలిసే ఉంటాయి. ఆయా వస్తుసేవలను వినియోగించిన రాష్ట్రాన్ని బట్టి కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల సొమ్ము పంపకం జరుగుతుంది. వస్తుసేవలను నాలుగు రకాలుగా విభజించి 5, 12, 18, 28 శాతాలుగా జీఎస్టీని నిర్ధారించారు. ఆయా వస్తు సేవలు ఏ కేటగిరీలో ఉన్నాయనే దానిని బట్టి గరిష్టంగా అంత శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

 

జీఎస్టీ పన్ను శ్లాబుల్లో చేర్చిన వస్తువులను బట్టి చూస్తే.. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులపై పూర్తిగా పన్ను ఎత్తివేయడంతో నిత్యావసరాల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే వ్యవసాయ ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించినా.. ఎరువులపై పన్ను పెంచడంతో ఆ మేరకు రైతాంగంపై భారం పడనుంది. బొట్టుబిళ్లలు, కుంకుమ, స్టాంపులు, పుస్తకాలు, న్యూస్‌ పేపర్లు, గాజులు, చేనేత, మెట్రోరైళ్లు, లోకల్‌ రైళ్లు, మాంస ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాలు, బ్రెడ్, తేనె లాంటి వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించడం మేలు చేకూర్చనుంది. గతంలో పన్ను లేని ఆటోమొబైల్‌ విడిభాగాలను ఏకంగా 28 శాతం పన్ను శ్లాబు కిందకు తీసుకురావడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాల ధరలు పెరిగే అవకాశాలున్నాయి.
జీఎస్టీతో విలాస వస్తువులు, సేవలపై పన్ను మోత మోగనుంది. సినిమాలు, హోటళ్లు, గెస్ట్‌ హౌస్‌లు, మ్యారేజ్‌ ఫంక్షన్‌ హాళ్లు, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు, రేస్‌ క్లబ్‌ బెట్టింగ్‌లు, బ్యూటీ కేర్‌ వస్తువులు వంటి ధరలు బాగా పెరిగే అవకాశం ఉంది. జీఎస్టీ నిబంధనల ప్రకారం డీలర్లు, వ్యాపారులు పన్నును ఆన్‌లైన్‌ లోనే చెల్లించాల్సి ఉంటుంది. రిజి స్ట్రేషన్, రిటర్నులు, చెల్లింపులూ ఆన్‌లైన్‌లోనే చేయాలి. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అన్ని ఇన్వాయిస్‌లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

 

మరోవైపు జీఎస్టీ పూర్తి స్థాయిలో అర్థం కావడానికి కనీసం ఏడాది కాలం పడుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎక్కువ రంగాల్లో వినియోగదారుడి జేబుకు చిల్లు పడటం ఖాయమని చెబుతున్నారు.