జయశంకర్, కేసీఆర్ కాలజ్ఞానులు

బ్రహ్మంగారి కాలజ్ఞానం విన్న తాను.. జీవితంలో ఇద్దరు కాలజ్ఞానులను చూశానని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. వారు ఒకరు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అయితే.. రెండో వ్యక్తి సీఎం కేసీఆర్ అని చెప్పారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు రూపొందించిన తెలంగాణ ఎకానమీ-ధృక్కోణం పుస్తకాన్ని అసెంబ్లీలోని తన చాంబర్ లో ఆయన ఆవిష్కరించారు. పుస్తకాన్ని తీసుకొచ్చిన ప్రొఫెసర్ భాస్కర్, పరిశోధక విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం, సామాజిక అంశాలపై మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి వెళ్ళాలని 2000 సంవత్సరంలోనే అనుకున్నామని మధుసూదనాచారి చెప్పారు. ఏం జరుగుతుందో ఆనాడే కేసీఆర్ చెప్పారని, అలాగే జరిగిందని గుర్తుచేసుకున్నారు. 2001లో తెలంగాణ కోసం కేసీఆర్ ధైర్యం చేసినపుడు వెకిలి నవ్వులు నవ్వారని, వారే ఇప్పుడు అభినందిస్తున్నారని చెప్పారు. ఆనాడు కుంగి పోలేదని, ఈనాడు పొంగిపోవడం లేదన్నారు. రెండు బలమైన పార్టీలు, రెండు బలమైన సామాజిక వర్గాలను ఎదుర్కొని తెలంగాణ తెచ్చుకోగలిగామని అన్నారు. తెలంగాణ ఉద్యమం వైవిధ్యమైనదని స్పీకర్ అభిప్రాయపడ్డారు.

విజ్ఞానం పేరుతో విధ్వంసం జరుగుతోందని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ బియ్యం వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. విజ్ఞానం పెరిగినకొద్ది విలువలు పెరగడం లేదని, అది బాధ కలిగిస్తోందన్నారు. మనిషి ఏం కావాలో తన చేతుల్లో ఉండదని, చేతల్లో ఉంటుందన్నారు. బ్రిటిష్ వారి వల్ల సంపదను గ్రహించి సొంతం చేసుకునే అలవాటు మద్రాస్ ప్రసిడెన్సీలో ఉన్నవారికి అబ్బిందని మధుసూదనాచారి విశ్లేషించారు.

తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార సంస్థ చైర్మన్ గుండు సుధారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.