ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌కు ఇంగ్లండ్  

సొంత  గడ్డపై జరుగుతున్న ఛాంపియన్స్  ట్రోఫీలో ఇంగ్లండ్‌ చెలరేగుతోంది. సూపర్ ఫాంలో ఉన్న ఇంగ్లండ్‌ లీగ్‌ దశలో వరుసగా రెండు విజయాలతో సెమీస్ బెర్తు దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్, సెకండ్ మ్యాచ్‌లోనూ సత్తా చాటింది. కార్డిఫ్ వేదికగా న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కమాండింగ్ విక్టరీ సాధించింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ 49.3 ఓవర్లలో 310 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అలెక్స్ హేల్స్ 56, జో రూట్ 64 పరుగులతో రాణించారు.  ఆల్‌ రౌండర్ బెన్ స్టోక్స్ మరోసారి 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక స్లాగ్ ఓవర్లలో ధాటిగా ఆడిన బట్లర్ 48 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, కొరీ అండర్సన్ చెరి మూడు వికెట్లు పడగొట్టారు. టిమ్ సౌథీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్‌కు తొలి ఓవర్లోనే జేక్ బాల్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ నాలుగో బంతికే కివీస్ ఓపెనర్ ల్యూక్ రోంచి డకౌట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ గుప్తిల్ 27 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో విలియమ్సన్, రాస్ టేలర్‌ ఇంగ్లండ్‌ బౌలర్లను ప్రతిఘటించారు.  మూడో వికెట్‌కు 95 పరుగులు జోడించారు. 87 పరుగులు చేసిన విలియమ్సన్‌ను మార్క్ వుడ్ ఔట్ చేసిన తర్వాత కివీస్ చేతులెత్తేసింది.  44.3 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ప్లంకెట్ 4 వికెట్లతో చెలరేగాడు. రషీద్, జేక్ బాల్‌ చెరి రెండు వికెట్లు దక్కించుకున్నారు.

కీలక వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్ పేసర్ జేక్ బాల్‌ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. గ్రూప్‌-ఏలో వరుసగా రెండు విజయాలు సాధించిన ఇంగ్లండ్‌ నాలుగు పాయింట్లతో సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది.