ఛాంపియన్స్ ట్రోఫీ విజేత పాకిస్తాన్

క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ మ్యాచ్ లో పాకిస్తాన్ అదరగొట్టింది. టైటిల్ వార్ లో టీమిండియాపై తిరుగులేని విజయం సాధించింది. లీగ్ దశలో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ వరల్డ్ క్లాస్ బౌలింగ్ ముందు టీమిండియా ముందు సమాధానమే లేకుండా పోయింది. పూర్తి వన్ సైడ్ గా సాగిన మ్యాచ్ లో టీమిండియా పూర్తి గా నిరాశ పర్చింది. పాకిస్తాన్ చేతిలో 180 పరుగుల తేడాతో ఓడింది. బౌలింగ్ లో నిప్పులు చెరిగిన అమిర్ మరోసారి టీమిండియా పతనాన్ని శాసించాడు. ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు తీసి టీమిండియా కోలుకోలేని దెబ్బతీశాడు. అటు హసన్ అలీ సైతం మూడు వికెట్లతో మెరిసాడు. షాబాద్ ఖాన్ కు రెండు. జునైద్ ఖాన్ కు ఒక్కవికెట్ దక్కింది. 76 రన్స్ చేసిన హార్ధిక్ పాండ్యా టాప్ స్కోరర్ గా నిలిచాడు

339 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆరంభంలోనే టీమిండియా ను అమిర్ దెబ్బ కొట్టాడు. మూడో బంతికే రోహిత్ శర్మను ఎల్బీ గా ఔట్ చేశాడు. 5 పరుగులే చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం అమిర్ బౌలింగ్ ఆడలేక ఔట్ అయ్యాడు. 21 రన్స్ చేసిన ధావన్ సైతం అమిర్ బౌలింగ్ లోనే ఔట్ అవడంతో టీమిండియా 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కాసేపు మెరుపులు మెరిపించిన యువరాజ్ 22 పరుగులు చేసి షాబాద్ బౌలింగ్ లో ఔట్ కాగా.. ఆదుకుంటాడనుకున్న ధోనీ 4 పరుగులే చేసి హసన్ అలీ బౌలింగ్ లో ఔట్ అవడంతో టీమిండియా పరాజయం ఖరారైంది. వెంటనే 9 రన్స్ చేసి జాదవ్ సైతం షాబాద్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో పాండ్యా కాసేపు మెరుపులు మెరిపించాడు. కేవలం 43 బంతుల్లోనే 6 సిక్సర్లు, 4 ఫోర్లతో 76 రన్స్ చేసి రనౌట్ అయ్యాడు. మిగతా బ్యాట్స్ మెన్లంతా చేతులెత్తేయడంతో టీమిండియా 30.3 ఓవర్లలోనే 158 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

అంతకు ముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ దుమ్మురేపింది. టీమిండియా ముందు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు ఫకార్, అజర్ అలీ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 128 పరుగుల భారీ పార్టనర్ షిప్ నమోదు చేశారు.. అద్భుత బ్యాటింగ్ తో అలరించిన ఫకార్ 114 పరుగులు చేయగా. అజర్ అలీ 59 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. మిడిలార్డర్ లో బాబర్ అజామ్ 46 వేగంగా ఆడి 46 రన్స్ చేశాడు. మాలిక్ 12 పరుగులు చేసి భువీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఇక చివర్లో హఫీజ్, ఇమాద్ లు రెచ్చిపోవడంతో పాక్ మూడువందల స్కోర్ దాటింది. హఫీజ్ 57, ఇమాద్ 25 పరుగులలతో నాటౌట్ గా నిలిచాడు.దీంతో పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో4 వికెట్ల నష్టానికి 338 రన్స్ చేసింది. టీమిండియా బౌలర్లలో భువీ, పాండ్యా, జాదవ్ లకు తలో వికెట్ దక్కింది.

మొత్తానికి గ్రేట్ రైవల్రీ మ్యాచ్ లో టీమిండియా పూర్తిగా నిరాశపర్చింది. మిరాకిల్ ఆటతీరుతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ముందు తేలిపోయింది. ఎనిమిదో ర్యాంక్ తో టోర్నీలో అడుగుపెట్టిన పాకిస్తాన్ తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ దక్కించుకుంది.